Homeక్రీడలుWTC Final 2023: భారత ఆటగాళ్లు ఆ ఇద్దరిని చూసి నేర్చుకోవాలి

WTC Final 2023: భారత ఆటగాళ్లు ఆ ఇద్దరిని చూసి నేర్చుకోవాలి

WTC Final 2023: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఘోర పరాభవం తరువాత భారత జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ భారత జట్టు మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత ప్లేయర్లు ఆ ఇద్దరు క్రికెటర్లను చూసి నేర్చుకోవాలంటూ సూచనలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం భారత క్రికెట్ లో దుమారం రేపుతున్నాయి.

టీమిండియా క్రికెటర్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటా, బయట తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులను ఆటగాళ్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో తీవ్రంగా నిరాశపరిచారు. భారత జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ భారత జట్టు ఆటగాళ్లపై విమర్శలు గుప్పించాడు.

ఆ ఇద్దరి ఆటగాళ్లను చూసి నేర్చుకోవాలి అంటూ హితవు..

భారత జట్టు ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ పలు సూచనలు చేశాడు. భారత బ్యాటర్ల ప్రదర్శన నిరాశ కలిగించిందని, ఈ మాటలతో వారి అభిమానులు నన్ను టార్గెట్ చేయవచ్చని పేర్కొన్నాడు. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు స్వింగ్, సీమ్ బంతులను ఎలా ఆడాలో పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ అజమ్, న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ను చూసి నేర్చుకోవాలంటూ హితవు పలికాడు. వీరిద్దరూ పేస్ బౌలింగ్ లో బంతిని గమనించి మెల్లిగా ఆడతారని పేర్కొన్నాడు. ఈ విషయాలను భారత జట్టు ఆటగాళ్లు విస్మరించి ఆడటం వల్లే బోల్తాపడ్డారని పేర్కొన్నాడు. టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ఈ విషయంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాజర్ హుస్సేన్ స్పష్టం చేశాడు.

తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్న విమర్శలు..

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓటమి తర్వాత భారత జట్టు ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ ఆటకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన ఈ ఇబ్బందులు తలెత్తాయి అంటూ పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. ఐపీఎల్ కు మాత్రమే హీరోలని, దేశం కోసం ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా ఆటగాళ్లు దేశం కోసం ఆడేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటూ పలువురు పేర్కొంటున్నారు.

Exit mobile version