Visakhapatnam MP Seat: విశాఖ ఎంపీ సీటు హాట్ కేక్. దేశంలోనే ప్రముఖ లోక్ సభ స్థానాల్లో ఇది ఒకటి. జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందింది ఈ సీటు. ప్రతి ఎన్నికలోనూ ఎంపీ సీటుకు ఆశావహులు ఎక్కువే. నాలుగు దశాబ్దాలుగా నాన్ లోకల్ నాయకులే ప్రాతినిధ్యం వహిస్తుండడం విశేషం. ఇప్పుడు కూడా నాన్ లోకల్ నాయకులే ఆశావహులుగా ఉన్నారు. వారి మధ్యే విపరీతమైన పోటీ ఉంది. అయితే ఇక్కడ నుంచి పోటీచేయడానికి ముందుకొచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీపీ ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. మరోసారి బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైసీపీలో ఆ మధ్య ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరు వినిపించింది. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విశాఖపై విజయసాయి ఫోకస్ పెంచారు. తన అనుచరగణాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈ క్రమంలో ఎంవీవీ సత్యనారాయణతో విజయసాయికి విభేదాలు ఏర్పడ్డాయి. విజయసాయి తీరుపై ఎంపీ సత్యనారాయణ బాహటంగానే విమర్శలు చేశారు. దీంతో నరసాపురం ఎంపీ రఘురామ మాదిరిగా ఎంవీవీ సత్యనారాయణ తిరుగుబాటు చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా విజయసాయి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తొలగించబడ్డారు. దీంతో వివాదానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది. అయితే ఈసారి వైసీపీ నుంచి రాయలసీమ నేతలు బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన శ్రీభరత్ స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. కేవలం నాలుగు వేల ఓట్లతో ఓటమి చవిచూశారు. గోదావరి జిల్లాలకు చెందిన మాజీ ఎంపీ దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి విశాఖ ఎంపీగా రెండు సార్లు గెలిచారు. ఆయన మనవడే శ్రీభరత్. గీతం వర్శిటీ చైర్మన్ గా ఉన్న శ్రీ భరత్ కూడా విశాఖ నుంచి ఎంపీ కావాలని చూస్తున్నారు. అయితే నాడు శ్రీభరత్ ఓటమికి జనసేన బరిలో ఉండడమే కారణం. జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణకు ఏకంగా 2 లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో ఓడినా కూడా శ్రీ భరత్ నిరాశపడలేదు. మరో చాన్స్ ఉంది అని ఆత్మవిశ్వాసంతో ఉంటూ వస్తున్నారు. అటు జేడీ లక్ష్మీనారాయణ సైతం ఏదో ఒక పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తానని చెబుతున్నారు. వీలుకాకుంటే ఇండిపెండెంట్ గానైనా బరిలో ఉంటానని ప్రకటించారు.
బీజేపీలో మాజీ మంత్రి పురందేశ్వరి, ఎంపీ జీవీఎల్ నరసింహరావు మధ్య కోల్డ్ వార్ నెలకొంది. టిక్కెట్ తనకంటే తనకు అంటూ ఈ ఇద్దరి నేతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పురందేశ్వరికి విశాఖ లోక్ సభ స్తానం దక్కింది. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. కానీ అనూహ్యంగా బీజేపీలో చేరారు. కానీ ఆశించిన పదవులు దక్కలేదు. అందుకే విశాఖ ఎంపీ సీటుపై దృష్టిపెట్టారు. 2024లో జరిగే ఎన్నికల్లో పొత్తులలో భాగంగా విశాఖ ఎంపీ సీటు నుంచి బరిలోకి దిగితే విజయం ఖాయమని ఆమె భావిస్తున్నారు. అయితే ఆమె కంటే ముందే రాజ్యసభ మెంబర్ జీవీఎల్ నరసిం హారావు విశాఖలో కర్చీఫ్ వేశారు. ఆయన ఏకంగా ఇల్లు ఒకటి కొనుక్కున్నారు. పోటీకి అన్నివిధాలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తానికైతే విశాఖ ఎంపీ సీటు హాట్ కేక్ గా మారింది.