https://oktelugu.com/

IND vs SL  T20 : భారత బౌలర్ కు గాయం.. ముఖం పై రక్తం.. అయినప్పటికీ బౌలింగ్ వేసి వికెట్ సాధించాడు.. నెట్టింట ప్రశంసల జల్లు.. ఫోటో వైరల్

శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో భారత బౌలర్ రవి బిష్ణోయ్ గాయపడ్డాడు. 16 ఓవర్లో అతడు వేసిన తొలి బంతిని లంక బ్యాటర్ కమిందు మెండీస్ గట్టిగా కొట్టాడు. అయితే దానిని రిటర్న్ క్యాచ్ అందుకునేందుకు రవి తీవ్రంగా ప్రయత్నించాడు. ఇందులో భాగంగా అతని కంటి కింద బంతి బలంగా తగిలింది. ఆ తగిలిన ప్రాంతం కందిపోయి వెంటనే రక్తం వచ్చింది

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 28, 2024 / 11:21 AM IST
    Follow us on

    IND vs SL  T20 :  టీమిండియా ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. మూడు టీ -20 లు, మూడు వన్డేలు ఆడనుంది.. ఇందులో భాగంగా శనివారం జరిగిన తొలి టి20 మ్యాచ్ లో భారత్ 43 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కొత్త కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 26 బంతుల్లో 58 రన్స్ చేసి వావ్ అనిపించాడు. రిషబ్ పంత్ 33 బంతుల్లో 49 పరుగులు చేసి.. ఒక్క పరుగు తేడాతో అర్ధ సెంచరిని కోల్పోయాడు. యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 40 పరుగులు చేసి వారేవా అనిపించాడు. గిల్ 15 బంతుల్లో 34 పరుగులు చేసి ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. దీంతో టీం ఇండియా 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీలంక బౌలర్లలో పతీరణ నాలుగో వికెట్లు పడగొట్టాడు. మధు శంక, అసిత ఫెర్నాండో, హసరంగ తలా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

    214 పరుగుల భారీ లక్ష్యాన్ని చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన శ్రీలంక జట్టు కీలక సమయంలో ఒత్తిడికి గురైంది. భారత బౌలర్ల పరాక్రమం ముందు తలవంచింది. 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది. 43 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. శ్రీలంక బ్యాటర్లలో నిస్సాంక అదరగొట్టాడు. 48 బంతుల్లో 79 పరుగులు చేసి ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. కుశాల్ మేడిస్ కూడా 27 బంతుల్లో 45 పరుగులు చేసి వారెవ్వా అనిపించాడు. అయితే శ్రీలంకలోని మిగతా ఆటగాళ్లు ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయారు. భారత బౌలర్లకు తలవంచడంతో కీలక సమయంలో శ్రీలంక వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. ఫలితంగా 170 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు తీశాడు.. అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు..రవి బిష్ణోయ్, సిరాజ్ చెరో వికెట్ సాధించారు.

    వాస్తవానికి శ్రీలంక 214 పరుగుల భారీ లక్ష్యంతో రంగంలోకి దిగినప్పుడు ధాటిగా ఆడింది. నిస్సాంక, మెండిస్ తుఫాన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లను ఏమాత్రం లెక్కపెట్టకుండా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 84 పరుగులు జోడించారు. వీరిద్దరూ కొరకరాని కొయ్యలుగా మారడంతో.. భారత విజయం పై నీలి నీడలు కమ్ముకున్నాయి.. ఈ దశలో మెండిస్ ను అర్ష్ దీప్ సింగ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కుశాల్ ఫెరీరా క్రీజ్ లోకి వచ్చాడు. నిస్సాంక, కుశాల్ దూకుడుగా ఆడారు. ఈ దశలో నిస్సాంక 34 బంతుల్లో 50 రన్స్ చేశాడు. అర్థ సెంచరీ పూర్తయిన తర్వాత నిస్సాంక మరింత ధాటిగా ఆడాడు.. అయితే అక్షర్ పటేల్ బౌలింగ్ లో నిస్సాంక అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా భారత్ వైపు మొగ్గింది. ఆ తర్వాత వచ్చిన అసలంక, షనక 0 పరుగులకే అవుట్ అయ్యారు. దీంతో శ్రీలంక తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఇదే సమయంలో రియాన్ పరాగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో శ్రీలంక ఓటమిపాలైంది.

    అయితే శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో భారత బౌలర్ రవి బిష్ణోయ్ గాయపడ్డాడు. 16 ఓవర్లో అతడు వేసిన తొలి బంతిని లంక బ్యాటర్ కమిందు మెండీస్ గట్టిగా కొట్టాడు. అయితే దానిని రిటర్న్ క్యాచ్ అందుకునేందుకు రవి తీవ్రంగా ప్రయత్నించాడు. ఇందులో భాగంగా అతని కంటి కింద బంతి బలంగా తగిలింది. ఆ తగిలిన ప్రాంతం కందిపోయి వెంటనే రక్తం వచ్చింది. దీంతో అతడి ముఖంపై ఆ రక్తపు మరకలయ్యాయి. వెంటనే జట్టు వైద్యులు మైదానంలోకి వచ్చి అతనికి చికిత్స చేశారు. ప్రధమ చికిత్స అనంతరం అతడికి అయిన గాయంపై బ్యాండిజీ వేశారు. ఆ తర్వాత అలాగే అతడు ఆట కొనసాగించాడు. చివరి బంతికి అసలంక ను ఔట్ చేసి ఆటపై తనకున్న మమకారాన్ని చాటుకున్నాడు. ఇక ఇటీవల జింబాబ్వే టోర్నీ లోనూ రవి సత్తా చాటాడు.