India vs South Africa T20: టీమిండియా మరో సమరానికి సన్నద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్ సంసిద్ధమవుతోంది. బుధవారం మొదటి టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గిన ఊపులో ఉన్న టీమిండియాకు ఇప్పుడు దక్షిణాఫ్రికాపై గెలవడం మరో సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో సిరీస్ చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో టీమిండియా కసరత్తులు చేసింది. కీలక బౌలర్లు హార్థిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ లేకుండానే బరిలో దిగుతోంది. విజయాల జోరు మీద ఉన్న టీమిండియా దక్షిణాఫ్రికాను సమర్థంగా ఎదుర్కొని నిలుస్తుందా అనేది సందేహమే. దీంతో ఈ సిరీస్ దక్కించుకోవడం అంత సులభం కాదని తెలుస్తోంది.

మూడు మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తుందని భావిస్తున్నారు. బ్యాటింగ్ లో బలంగా ఉన్నాబౌలింగ్ సమస్య మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మన బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. దీంతో ప్రత్యర్థి భారీ స్కోరు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. దక్షిణాఫ్రికా జట్టు బలంగా ఉన్నందున ఈ సిరీస్ హోరాహోరీగా సాగనుందని సమాచారం. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్ ల్లో ఆధిపత్యం చెలాయించాలని రెండు జట్లు భావిస్తున్నాయి. కానీ ఏ జట్టు కోరిక తీరుతుందో తెలియడం లేదు.
భువనేశ్వరే కాదు బుమ్రా, హర్షల్ పటేల్ కూడా ఆఖర్లో ధారాళంగా పరుగులిస్తుండటం పెద్ద మైనసే. ఆసీస్ తో జరిగిన సిరీస్ లో ఈ విషయం స్పష్టమైంది. దక్షిణాఫ్రికా పటిష్టంగా ఉండటంతో టీమిండియా పరిస్థితి ఎలా ఉంటుందోననే అనుమానం అందరిలో వ్యక్తమవుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో ఓవర్ కు 12 పరుగులు ఇవ్వడం గమనార్హం. కెరీర్ పరంగా పట్టు కోసం ప్రయత్నిస్తున్న ఆటగాళ్లు సైతం తమ నైపుణ్యం ప్రదర్శించలేకపోతున్నారు. ఫలితంగా జట్టు గెలుపును శాసించలేకపోవడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

వచ్చే నెలలో ప్రపంచ కప్ ఉన్న సందర్భంలో ఆటగాళ్ల నైపుణ్యతను ప్రదర్శించాల్సిన సమయం వచ్చినా కొందరు మాత్రం సద్వినియోగం చేసుకోవడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచుల్లో ఇది ప్రధానంగా కనిపించింది. చివరి మ్యాచ్ లో స్పిన్నర్ చాహల్ ఫామ్ లోకి రావడం సానుకూల అంశమే. అశ్విన్ కు సిరీస్ లో ఆడే అవకాశం దక్కొచ్చు. బ్యాటింగులో ఓపెనర్ రాహుల్ నిలకడగా ఆడాల్సిన అవసరం ఏర్పడింది. ఇక దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ ను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. దినేష్ కార్తీక్ క్రీజులో నిలిచి మరింత సమయం గడపాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. జట్టులో అందరు సమన్వయంతో ఆడి సిరీస్ ను సొంతం చేసుకోవాలని సగటు ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు.