India vs South Africa : మరికొద్ది గంటల్లో టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పొట్టి ప్రపంచ కప్ కోసం టీం ఇండియా -దక్షిణాఫ్రికా పోటీ పడనున్నాయి.. ఇప్పటికే బార్బడోస్ మైదానాన్ని ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధం చేశారు. రెండు జట్ల ఆటగాళ్లు కూడా ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ప్రస్తుత ప్రపంచ కప్ లో అటు దక్షిణాఫ్రికా, ఇటు టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ దాకా వచ్చాయి. చోకర్ అని ముద్ర పడిన దక్షిణాఫ్రికా జట్టు.. ఈసారి ఒత్తిడిని దూరం పెట్టి.. స్వేచ్ఛగా ఆడింది. కఠిన పరిస్థితుల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది.. టి20 ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియా – దక్షిణాఫ్రికా పరస్పరం పోటీ పడడం ఇదే తొలిసారి. అయితే టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఫైనల్ ఆడిన జట్లు మరోసారి ఫైనల్ లో తలపడలేదు. ప్రతి ఎడిషన్ లోను కొత్త ప్రత్యర్థులే పరస్పరం ఢీకొన్నారు.
ALSO READ : సౌతాఫ్రికాతో ఫైనల్ ఫైట్.. టీమిండియా చేయాల్సింది ఇదే
2007 లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ ఉత్కంఠ మధ్య విజయం సాధించింది. టి20 వరల్డ్ కప్ ప్రారంభ ఎడిషన్ విజేతగా నిలిచింది.
2009లో టి20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ వేదికగా జరిగింది. పాకిస్తాన్ – శ్రీలంక జట్లు ఫైనల్లో తలపడ్డాయి.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. తొలిసారి టి20 వరల్డ్ కప్ ను సగర్వంగా ఒడిసి పట్టింది.
2010లో టి20 వరల్డ్ కప్ వెస్టిండీస్ వేదికగా జరిగింది. ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడ్డాయి. ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలిసారి ఐసీసీ చాంపియన్ గా నిలిచింది.
2012లో శ్రీలంక వేదికగా టి20 వరల్డ్ కప్ జరిగింది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక – వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. వెస్టిండీస్ శ్రీలంకపై విజయం సాధించి.. తొలిసారి t20 వరల్డ్ కప్ దక్కించుకుంది.
2014 లో బంగ్లాదేశ్ వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్లో భారత్ – శ్రీలంక తలపడ్డాయి. శ్రీలంక భారత్ పై విజయం సాధించి తొలిసారి టీ20 వరల్డ్ కప్ దక్కించుకుంది.
2016లో టి20 వరల్డ్ కప్ ను భారత్ వేదికగా నిర్వహించారు. వెస్టిండీస్ – ఇంగ్లాండ్ జట్లు ఫైనల్లో తలపడ్డాయి. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై వెస్టిండీస్ విజయం సాధించి రెండవసారి టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది.
2021లో భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాల వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించారు. ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ ఫైనల్ వెళ్లాయి. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించి.. తొలిసారి టీ20 వరల్డ్ కప్ దక్కించుకుంది.
2022 లో టి20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా వేదికగా నిర్వహించారు. ఇంగ్లాండ్ – పాకిస్తాన్ జట్లు ఫైనల్ వెళ్లాయి. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మరో టి20 వరల్డ్ కప్ ను దక్కించుకుంది..
2024లో అమెరికా – వెస్టిండీస్ దేశాల వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారు. ఫైనల్ లోకి టీమిండియా – దక్షిణాఫ్రికా దూసుకెళ్లాయి. ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధించి, విజేతగా ఆవిర్భవిస్తారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.