India Vs South Africa 3rd T20: మూడవ టి20 మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ పై పట్టు సాధించాలని అటు దక్షిణాఫ్రికా, ఇటు భారత్ భావిస్తున్నాయి. రెండో టి20 మ్యాచ్లో ఓడిపోయిన నేపథ్యంలో టీమిండియా పై ఒత్తిడి పెరిగిపోయింది. బౌలర్లు రాణిస్తున్నప్పటికీ.. బ్యాటర్లు చేతులెత్తేయడం టీమిండియాను కలవరపాటుకు గురిచేస్తున్నది. ఇటీవలి సిరీస్ లలో టీమిండియాకు ఓటమి అనేది లేదు. అదే ఘనతను కొనసాగించాలంటే మూడో టి20 లో సూర్య కుమార్ సేన కచ్చితంగా గెలుపొందాలి. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని భారత్ తుది జట్టులో అనేక మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది.. ఇటీవలి సిరీస్ లలో వరుసగా విఫలమవుతున్న ఓపెన్ అభిషేక్ శర్మకు ఈ మ్యాచ్లో విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అతడి స్థానంలో తిలక్ వర్మను ఓపెనర్ గా పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. తిలక్ వర్మ ఓపెనర్ గా వెళ్తే.. అతని స్థానంలో ఆల్ రౌండర్ రమణ్ దీప్ సింగ్ ను జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. అతని రాకతో మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం అవుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది.. రింకూ సింగ్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోవడంతో.. అతనికి ఈ మ్యాచ్ ద్వారా చివరి అవకాశం మేనేజ్మెంట్ ఇచ్చిందని.. ఈ మ్యాచ్లో తనను తాను నిరూపించుకోకపోతే.. రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేస్తారని తెలుస్తోంది. ఇక హార్థిక్ పాండ్యా రెండో టి20 39 పరుగులు చేసినప్పటికీ అతడు 45 బంతులను ఉపయోగించాడు. 28 బంతులను ఎదుర్కొన్న తర్వాత అతడు తొలి బౌండరీ సాధించాడు. సంజు రెండో మ్యాచ్లో డక్ అవుట్ కావడంతో అది టీమిండియా స్కోర్ పై ప్రభావం చూపించింది. అతడు అలా అవుట్ అయినప్పటికీ మిగతా ఆటగాళ్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు.
పేస్ బౌలర్లు పూర్వపు లయను అందుకోవాలి
తొలి టి20 మ్యాచ్లో పేస్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ అదరగొట్టాడు. రెండో టి20 మ్యాచ్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. చివరి రెండు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి జట్టు ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. అయితే అతడిని కూడా పక్కనపెట్టి వైశాఖ్ లేదా యశ్ కు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక మూడవ టి20 జరిగే సెంచూరియన్ మైదానం పేస్ బౌలర్లకు స్వర్గధామం. ఇదే సమయంలో స్పిన్నర్లకు అత్యంత అనుకూలం. నేడు జరిగే మ్యాచ్లో వరుణ్, రవి బిష్ణోయ్ కీలకమయ్యే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్ల అంచనా ఇలా
భారత్
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు, ఆవేష్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణ్ దీప్ సింగ్, రవి బిష్ణోయ్.
దక్షిణాఫ్రికా
మార్క్రం(కెప్టెన్), క్లాసెన్, మిల్లర్, జాన్సన్, కేశవ్, రికెల్టన్, హెన్డ్రిక్స్, సిమలానే, సిపామ్ల, కొట్జి, స్టబ్స్.
సెంచూరియన్ మైదానం పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లకు కూడా సహకరిస్తుంది. ఈ వేదికపై టాస్ గెలిచే జట్టు బౌలింగ్ ఎంచుకుంటుంది. గత రెండు మ్యాచ్ లలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది.. ఒక మ్యాచ్లో ఓడిపోయింది.. మరో మ్యాచ్లో విజయం సాధించింది. ఈ మైదానంపై టాస్ గెలిచిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.