https://oktelugu.com/

Vikarabad: కలెక్టర్ పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్.. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.‌.

అది హైదరాబాద్.. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కులో ఉదయం ఆయన వాకింగ్ చేస్తున్నారు. ఈ లోగా పోలీసులు అక్కడికి వచ్చారు. ఆయనను అరెస్టు చేశారు. పోలీసులు భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యేను తమ వెంట తీసుకెళ్లారు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 13, 2024 10:14 am

Vikarabad

Follow us on

Vikarabad: తెలంగాణ పోలీసులు హైదరాబాదులో మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా అరెస్టు చేసిన ఆ మాజీ ఎమ్మెల్యే పేరు పట్నం నరేందర్ రెడ్డి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొడంగల్ నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై ఇటీవల దాడి జరిగింది. ఆ ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అభియోగాలు మోపుతూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం వెనక పట్నం నరేందర్ రెడ్డి హస్తము ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమపై కుట్రలు పన్నుతున్నారని భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శిస్తున్నారు. కలెక్టర్ పై దాడి చేసిన వ్యక్తుల్లో ఒకరు పట్నం నరేందర్ రెడ్డి తో ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు చెబుతున్నారు. విచారణ నిమిత్తం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశామని పోలీసులు వివరిస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లి ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇందులో ముందుగా ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆయా గ్రామాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని భావించింది. ఇందులో భాగంగా సోమవారం దుద్యాల ప్రాంతంలో అధికారులు గ్రామసభ నిర్వహించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో కలెక్టర్ పై ప్రజలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన వెనుక కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులు ఉన్నారని భావిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక జిల్లా కలెక్టర్ పై దాడి చేసేలా ప్రజలను ఒక వ్యక్తి రెచ్చగొట్టారని పోలీసులు అంచనాకు వచ్చారు. అతడు పట్నం నరేందర్ రెడ్డి కి ప్రధాన అనుచరుడని.. అతడి పేరు సురేష్ అని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన జరగడానికి ముందు నరేందర్ రెడ్డి అనేకసార్లు సురేష్ తో మాట్లాడారని పోలీసులు వివరిస్తున్నారు. మరోవైపు పట్టణం నరేందర్ రెడ్డి కూడా సురేష్ తో మాట్లాడుతూ.. మధ్యలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా సంభాషించినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై సమగ్ర వివరాలు తెలుసుకోవడానికి డీజీపీ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే పట్నం నరేందర్ రెడ్డి కి సురేష్ ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఇతడి పై గతంలో అనేక కేసులు ఉన్నాయి. అందులో అత్యాచారం కేసు కూడా ఉంది. ఈ కేసులను తొలగించడానికి పట్నం నరేందర్ రెడ్డి అప్పట్లో పోలీసులపై ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది