Vivek Rama swamy : అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో అడుగు పెట్టనున్నారు. 2025, జనవరి 20న బాధ్యతలు బదిలీ చేసే అవకాశం ఉంది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అధికార మార్పిడికి ఇంకా రెండు నెలల సమయం ఉండడంతో డొనాల్డ్ ట్రంప్ తన కొత్త క్యాబినెట్, వైట్‌హౌస్ కార్యవర్గం కూర్పుపై దృష్టిపెట్టారు. ఎవరెవరికి ఏఏ పదవులు ఇవ్వాలో కసరత్తు చేస్తున్నారు. సమర్థులను వైట్‌హౌస్ కార్యవర్గంలోకి, విధేయులను ప్రభుత్వంలోకి తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేఐస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొందరికి పదవులు ప్రకటించారు కూడా. ఇక ఎన్నికల్లో ట్రంప్ విజయానికి విశేష కృషి చేసిన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, రిపబ్లికన్ పార్టీ నేత, ఆ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థికి పోటీ పడిన భారత అమెరికాన్ వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు.
ఇద్దరికీ కీలక బాధ్యతలు..
అధ్యక్ష ఎన్నికల్లో అద్భుత విజయం అందుకున్న ట్రంప్ తనకు మద్దతుగా నిలిచిన బిలియనీర్ ఎలాన్ మస్క్ పార్టీ నేత వివేక్ రామస్వామికి ఎఫీషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఎలాన్ మస్క్‌కు గవర్నమెంట్ ఎఫీషియెన్సీ డిపార్ట్‌మంట్ హెడ్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇక వివేక్ రామస్వామికి కూడా హెడ్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ ఇద్దరు అద్భుతమైన అమెరికన్లనీ, కలిసి వృథా ఖర్చులను తగ్గించి, ఫెడరల్ ఏజెన్సీలను పునర్నిర్మిస్తారని కాబోయే అధ్యక్షడు ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. సేవ్ అమెరికా -2 ఉద్యమానికి ఇవి ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. వీరిద్దరూ తన పాలనకు మార్గం సుగమం చేస్తారని వెల్లడించారు.
అధ్యక్ష అభ్యర్థి కోసం..
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష అభ్యర్థి కోసం వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడ్డారు. అయితే ఆయన ప్రైమరీల్లో ఏ దశలోనూ ట్రంప్‌కు పోటీ ఇవ్వలేదు. ఆదరణ అంతంత మాత్రంగానే రావడంతో పోటీ నుంచి వైదొలిగారు. బహిరంగంగా ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. ఇక మస్క్ కూడా ట్రంప్ విజయంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో విధేయులిద్దరికీ కీలక పదవులు అప్పగించారు ట్రంప్.