India Vs Pakistan Asia Cup 2025 Final: ఐసీసీ నిర్వహించే టోర్నీలకు విభిన్నమైన చరిత్ర ఉంటుంది. ఇందులో ఆసియా కప్ ఒకటి. ఆసియా కప్ కు దాదాపు 41 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆసియా ఖండంలో క్రికెట్ ఆడే దేశాలు అనేకం ఉన్నప్పటికీ.. ఆసియా కప్ లో మాత్రం టీమ్ ఇండియాదే తిరుగులేని డామినేషన్. ఆ తర్వాత శ్రీలంక రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో టీమిండియా ఇప్పటికే ఫైనల్ వెళ్ళిపోగా.. పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై గెలిచి ఫైనల్ వెళ్ళింది.
వాస్తవానికి టీం ఇండియా ఫైనల్ బెర్త్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే ఖరార్ అయింది. ఎందుకంటే టీమిండియా లీగ్ దశలో మూడుకు మూడు.. సూపర్ ఫోర్ లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు గెలిచి తిరుగులేని నెట్ రన్ రేట్ తో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది. అయితే మిగతా జట్లు (ఇప్పటికే శ్రీలంక ఇంటికి వెళ్ళిపోయింది) బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఫైనల్ స్థానం కోసం పోటీ పడగా.. అందులో పాకిస్తాన్ గెలిచింది. ఫైనల్లో భారత జట్టుతో పోటీపడేందుకు సిద్ధమయింది. ప్రస్తుత ఆసియా కప్ లో టీమిండియా, పాకిస్తాన్ రెండుసార్లు పోటీపడ్డాయి.. లీగ్, సూపర్ 4 దశలో తలపడ్డాయి. రెండుసార్లు కూడా టీమిండియా విజయం సాధించింది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో.. సూపర్ ఫోర్ దశలో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాలు అందుకుంది.
41 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆసియా కప్ లో ఈ రెండు జట్లు ఫైనల్లో పోటీ పడడం ఇదే తొలిసారి. ఫైనల్ పోటీ ఈనెల 28న జరుగుతుంది. ఐసీసీ నిర్వహించిన టోర్నీలలో భారత్, పాకిస్తాన్ రెండుసార్లు తలపడ్డాయి. 2007 టి20 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ లో పోటీపడ్డాయి. ఇందులో 2007 లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలిచింది. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ విజయం సాధించింది. అయితే కొంతకాలంగా ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నీలలో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వరుసగా ఏడు మ్యాచ్లు గెలిచి పాకిస్తాన్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది టీం ఇండియా. ప్రస్తుత ఆసియా కప్ లోనూ వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్లో కూడా అదే జోరు కొనసాగించాలని టీమిండియాను అభిమానులు కోరుతున్నారు.