India Vs Pakistan: టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ తల పడుతున్నాయి. కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. తటస్థ వేదిక పై మ్యాచ్ నిర్వహిస్తున్నారు.
చాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు భారత్ దుబాయ్ వేదికగా మ్యాచ్ లు ఆడింది. ఇప్పుడు పాకిస్తాన్ కొలంబో వేదికగా ఆడుతోంది.
కొద్ది నెలల క్రితం ఆసియా కప్ జరిగినప్పుడు టీమిండియా మూడు మ్యాచ్ లలో పాకిస్తాన్ జట్టుపై గెలిచింది. మూడుసార్లు గెలిచినప్పుడు కూడా పాకిస్తాన్ ప్లేయర్లకు భారత ప్లేయర్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు…
ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ పై విజయం సాధించిన తర్వాత టీమ్ ఇండియా ప్లేయర్లు ఆసియా కప్ ట్రోఫీని నక్వి చేతుల మీదుగా తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఈ వివాదాలు మొత్తం కొద్ది నెలలపాటు క్రికెట్ ప్రపంచంలో తీవ్రమైన చర్చకు దారితీసాయి.
ఇక ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ మ్యాచ్లో టీమిండియా ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేస్తారా.. గత సంప్రదాయాన్ని కొనసాగిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.
ఇటీవల అండర్ 19 ప్రపంచకప్ జరిగినప్పుడు టీమిండియా ప్లేయర్లు కూడా సీనియర్ ఆటగాళ్ల దారిలోనే నడిచారు. పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.
ఇప్పటికే ఐసీసీ వద్ద పాకిస్తాన్ క్రికెట్ బోర్డు షేక్ హ్యాండ్ వ్యవహారాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్లేయర్లు చేతులు కలిపే విధంగా చూడాలని ఐసీసీ వద్ద పాకిస్తాన్ కోరినట్టు తెలుస్తోంది. దీనిపై సూర్యకుమార్ యాదవ్ ను విలేకరులు ప్రశ్నిస్తే.. ” మీరు మంచిగా భోజనం చేయండి. మంచిగా విశ్రాంతి తీసుకోండి. ఇంకో 24 గంటలు ఆగితే మేము ఏం చేస్తామన్నది తెలుస్తుంది. ఇక్కడ మేము క్రికెట్ ఆడేందుకు వచ్చాం. అత్యుత్తమమైన క్రికెట్ ఆడతామని” సూర్య కుమార్ యాదవ్ పేర్కొన్నాడు. దీనిని బట్టి పాకిస్తాన్ ప్లేయర్లకు టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వరని తెలుస్తోంది.