India Vs New Zealand: అనుకున్నట్టుగానే దుబాయ్ మైదానంలో టీమ్ ఇండియా స్పిన్నర్లు అదరగొడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బ్యాటర్లను బెదరగొడుతున్నారు. మైదానం స్పిన్ కు సహకరిస్తోంది అని తెలిసినప్పటికీ.. తేమ కూడా పెద్దగా ఉపయోగపడదని అవగతమైనప్పటికీ న్యూజిలాండ్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక్కడే అతడు బోల్తాపడ్డాడు.
Also Read: భారత్ – న్యూజిలాండ్ మధ్య నేడు CT ఫైనల్..బెట్టింగ్ ఎన్ని వేల కోట్లో తెలుసా?
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను విల్ యంగ్(15), రచిన్ రవీంద్ర(37) మొదలుపెట్టారు. వీరిద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. తొలి వికెట్ కు 7.5 ఓవర్లలో 57 పరుగులు జోడించారు. మహమ్మద్ షమీ, హార్థిక్ పాండ్యా బౌలింగ్ లో యంగ్, రచిన్ విర విహారం చేస్తున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దింపాడు. అది ఫలితాన్ని ఇచ్చింది. 7.5 ఓవర్లో వరుణ్ చక్రవర్తి వేసిన బంతిని యంగ్ తప్పుగా అంచనా వేశాడు. ఫలితంగా వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 57 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.. 37 పరుగులు చేసి జోరు మీద ఉన్న మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర ను అద్భుతమైన బంతివేసి కులదీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోర్ 10.1 ఓవర్లలో 69 పరుగులు.. అప్పటికే ఓపెనర్లిద్దరిని న్యూజిలాండ్ కోల్పోయింది. ఈ దశలో వచ్చిన కేన్ విలియంసన్ (11) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కులదీప్ యాదవ్ కు బౌలింగ్లో క్యాచ్ అండ్ బౌల్డ్ గా అవుట్ అయ్యాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోర్ 12.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 75 పరుగులు. ఇక ఈ దశలో వచ్చిన టామ్ లాథమ్(14) రవీంద్ర జడేజా బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి 108 పరుగులు చేసింది.
కులదీప్ తిప్పేశాడు
వాస్తవానికి ఈ మ్యాచ్లో కులదీప్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంటారని వార్తలు వచ్చాయి. టీమ్ మేనేజ్మెంట్ ని కూడా అదేవిధంగా సంకేతాలు ఇచ్చింది. కానీ రోహిత్ శర్మ కులదీప్ యాదవ్ పై నమ్మకం ఉంచాడు. కచ్చితంగా అతడు అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని భావించాడు. ఇందులో భాగంగానే అతడికి తుది జట్టులో స్థానం ఇచ్చాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని కులదీప్ యాదవ్ వమ్ము చేయలేదు. పైగా బంతితో మ్యాజిక్ చేశాడు. న్యూజిలాండ్ బ్యాటర్ లను ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికా తో జరిగిన సెమీఫైనల్ మ్యాచులు సెంచరీలతో హోరెత్తించిన రచిన్ రవీంద్ర, విలియంసన్ వికెట్లను కులదీప్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరూ అవుట్ కావడం టీమ్ ఇండియాకు పెద్ద రిలీఫ్ లాగా అనిపించింది. ఒకవేళ వీరిద్దరు గనుక అవుట్ కాకుండా ఉండి ఉంటే.. న్యూజిలాండ్ స్కోర్ మరో విధంగా ఉండేది. ఈ కథనం రాసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 31 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజ్ లో మిచెల్(33), ఫిలిప్స్(18) ఉన్నారు. కులదీప్ యాదవ్ రెండు, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరో వికెట్ సాధించారు.
Also Read: మైదానంలో టీమిండియా మీద గెలవలేరు..ఫైనల్ లో మాత్రం కివీస్ కు సపోర్టు.. ఏం బతుకులు రా మీవి?!