India vs England Test Series 2025: గిల్ ఆధ్వర్యంలో భారత జట్టు ఎరుపు బంతి సమరాన్ని మొదలుపెట్టనుంది. శుక్రవారం నుంచి లీడ్స్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో భారత్ తొలి టెస్ట్ ఆడుతుంది. 2025 -27 డబ్ల్యూటీసీలో భాగంగా భారత్ ఆడే తొలి టెస్ట్ సిరీస్ ఇదే. దీంతో ఈ సిరీస్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆతిథ్య జట్టు కూడా ఈ సిరీస్ నెగ్గాలని భావిస్తోంది.
ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆంగ్లేయుల గడ్డమీదికి భారత జట్టు అడుగు పెట్టింది. బుమ్రా, జడేజా, పంత్.. మినహా మిగతా వారంతా యువ ఆటగాళ్లు, అంతంత మాత్రం అనుభవం ఉన్నవాళ్లే కావడంతో.. ఇంగ్లీష్ జట్టును ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల జరిగిన అనధికారిక టెస్ట్ లలో భారత ప్లేయర్లు అదరగొట్టారు. బీభత్సంగా బ్యాటింగ్ చేసి సత్తా చాటారు. ముఖ్యంగా “కేఎల్” ఫామ్ లోకి వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీలతో కదం తొక్కాడు. అయితే మన మైదానాలతో పోల్చి చూస్తే ఇంగ్లీష్ గడ్డలోని మైదానాలు కాస్త విభిన్నంగా ఉంటాయి. ఇక తొలి సుదీర్ఘ సమరం మొదలయ్యే లీడ్స్ మైదానంలో గతంలో పర్యాటక జట్టు రికార్డులను ఒకసారి పరిశీలిస్తే..
1986లో తొలి విజయం..
హెడింగ్లి ప్రాంతంలో ఉన్న లీడ్స్ మైదానంలో భారత్ 1986లో తొలి విజయాన్ని నమోదు చేసింది. నాటి రోజుల్లో ఆంగ్ల జట్టును 279 పరుగుల వ్యత్యాసంతో ఓటమి పాలు చేసింది. ఇక 2002 ఆగస్టులో ఇదే మైదానం వేదికగా ఆంగ్ల జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 46 పరుగుల వ్యత్యాసంతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. 2021 ఆగస్టులో భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరి మ్యాచ్ జరిగింది. నాటి మ్యాచ్లో భారత్ 76 రన్స్ వ్యత్యాసంతో ఓటమిపాలైంది. మొత్తం మీద ఈ మైదానంలో భారత్ ఏడు మ్యాచ్ లు ఆడింది. ఇందులో రెండు విజయాలు మాత్రమే సాధించింది. నాలుగు మ్యాచ్లలో ఓటమిపాలైంది. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. భారత్ ఈ వేదికగా 2002లో చివరి విజయాన్ని సాధించగా.. 2021లో భారీ ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లీష్ జట్టు మీద ఓటమిపాలైంది.
వాతావరణం ఎలా ఉందంటే..
ఇక ప్రస్తుతం ఈ మైదానంలో వాతావరణం కాస్త వేడి గానే ఉంది.. ఇంగ్లాండ్ ఎలాగో బజ్ బాల్ క్రికెట్ ఆడుతుంది కాబట్టి..తొలి టెస్ట్ ఆసక్తికరంగా సాగే అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ మైదానం బ్యాటింగ్ వికెట్ అని క్యూరేటర్ చెబుతున్నారు. భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించినప్పుడు.. సిరీస్ మధ్యలో ఒక మ్యాచ్ ఈ మైదానం వేదికగా నిర్వహించేవారు. అయితే ఈసారి తొలి మ్యాచ్ నే ఈ మైదానం వేదికగా నిర్వహించడం విశేషం..క్యూరేటర్ చెబుతున్న దాని ప్రకారం తొలిరోజు పేస్ బౌలర్లకు ఈ మైదానం అనుకూలించినప్పటికీ.. క్రమేపీ ప్లాట్ అవుతుందని తెలుస్తోంది. దీనివల్ల బ్యాటర్లు పండగ చేసుకుంటారని.. టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.