India vs England: రవిచంద్రన్ అశ్విన్ మెరుపు బౌలింగ్.. అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్

ఈ జాబితాలో మురళీధరన్ అందరికంటే టాప్ ప్లేస్ లో ఉన్నాడు. మరో 34 సార్లు 5 వికెట్లను సాధిస్తే అశ్విన్ మురళీధరన్ సరసన నిలుస్తాడు.

Written By: NARESH, Updated On : February 25, 2024 6:01 pm
Follow us on

India vs England : ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తనదైన రోజు ఎంతటి జట్టునైనా కకావికలం చేసే రవిచంద్రన్..ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టును ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఇంగ్లాండ్ జట్టు మీద ఇటీవల టెస్టుల్లో తన 500 వికెట్ల రికార్డును అధిగమించిన రవిచంద్రన్.. ఇప్పుడు తాజాగా మరో ఘనతను సాధించాడు. రాంచి వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండవ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుమార్ రికార్డును అధిగమించాడు. ఇటీవల తన మాతృమూర్తి ఆరోగ్యం బాగా లేకుంటే రాజ్ కోట్ టెస్ట్ నుంచి అప్పటికప్పుడు చెన్నై వెళ్ళిపోయాడు. ఒకరోజు తన తల్లి వద్ద ఉండి మరుసటి రోజు రాజ్ కోట్ వచ్చాడు. ఆ టెస్ట్ లో టీమిండియా సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాజ్ కోట్ లో గెలుపొందడం ద్వారా టెస్టులలో భారత జట్టు అతిపెద్ద విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది.

నాలుగో టెస్ట్ రాంచి వేదికగా శుక్రవారం ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. రవీంద్ర జడేజా 4, ఆకాష్ 3 వికెట్లు తీసి సత్తా చాటారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా జట్టు 307 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇండియా బ్యాటర్లు త్వర త్వరగా అవుట్ అవుతుండడంతో.. అశ్విన్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే అతడు మూడవ టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి హార్టీ లీ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ తో ఆకట్టుకోకపోయినప్పటికీ బౌలింగ్లో అశ్విన్ రెచ్చిపోయాడు.

ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కొంతసేపటికి అశ్విన్ తన స్పిన్ మాయాజాలాన్ని రుచి చూపించాడు. ఇంగ్లాండ్ జట్టు స్కోరు 19 పరుగుల వద్ద ఉన్నప్పుడు డకెట్, పోప్ ను వరుస బంతుల్లో పెవిలియన్ పంపించాడు. అశ్విన్ ధాటికి ఇంగ్లాండ్ జట్టు టాప్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. రూట్, ఫోక్స్, అండర్సన్ వికెట్లను సాధించడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఏకంగా భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. అనిల్ కుంబ్లే టెస్టుల్లో 35 సార్లు ఐదు వికెట్లను నేలకూల్చాడు. ఇందుకుగానూ అతడు132 టెస్టులు ఆడాడు. రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ జట్టుపై ఐదు వికెట్లు సాధించిన నేపథ్యంలో.. తన ఖాతాలో 35 సార్లు 5 వికెట్లు సాధించిన ఘనతను లిఖించుకున్నాడు. ఇందుకుగానూ రవిచంద్రన్ అశ్విన్ 99 టెస్టులు ఆడాడు. రవిచంద్రన్ అశ్విన్ కంటే రిచర్డ్ హ్యాడ్లీ ముందున్నాడు. అతడు 86 టెస్టులాడి 36 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. షేన్ వార్న్ 145 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 37 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. ముత్తయ్య మురళీధరన్ 133 టెస్టులు ఆడి 67 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో మురళీధరన్ అందరికంటే టాప్ ప్లేస్ లో ఉన్నాడు. మరో 34 సార్లు 5 వికెట్లను సాధిస్తే అశ్విన్ మురళీధరన్ సరసన నిలుస్తాడు.