India Vs England: రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు తొలిరోజు ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్ సిరాజ్ చెలరేగి బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండు మిడిల్ ఆర్డర్ వణికిపోయింది. బెన్ డక్కెట్ 153 పరుగులు చేసినప్పటికీ.. మిగతా ఆటగాళ్లు అంతగా రాణించలేకపోయారు. బెన్ స్టోక్స్(41), పోప్(39) మాత్రమే పరవాలేదు అనిపించారు.. రూట్(18), క్రాలీ(15), ఫోక్స్(13), బెయిర్ స్టో(0) విఫలమయ్యారు.
తొలి ఇన్నింగ్స్ 207/2 తో శనివారం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 39.5 ఓవర్ లో 224 పరుగుల వద్ద జో రూట్ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో రివర్స్ షాట్ ఆడబోయిన రూట్ స్లిప్ లో ఉన్న జైస్వాల్ కు చిక్కాడు. ఆ తర్వాత ఒక పరుగు జోడించిన ఇంగ్లాండ్ జట్టు బెయిర్ స్టో రూపంలో మరో వికెట్ కోల్పోయింది. కుల దీప్ యాదవ్ బౌలింగ్ లో బెయిర్ స్టో వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ స్టోక్స్ తో కలిసి డక్కెట్ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు 260 పరుగులకు చేరుకోగానే డక్కెట్ కుల దీప్ యాదవ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.
డక్కెట్ ఔట్ అయిన తర్వాత ఫోక్స్ క్రీజ్ లోకి వచ్చాడు. స్టోక్స్, ఫోక్స్ కుదురుకుంటుండగానే .. స్టోక్స్ ను జడేజా అవుట్ చేశాడు. 41 పరుగులు చేసిన స్టోక్స్ బుమ్రా పట్టిన అద్భుతమైన క్యాచ్ కు వెనుతిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 299. స్టోక్స్ ఆయన వెంటనే ఫోక్స్ కూడా వెనుతిరిగాడు. సిరాజ్ బౌలింగ్ లో రోహిత్ పట్టిన క్యాచ్ కి ఔట్ అయ్యాడు. ఇక మిగతా మూడు వికెట్లను సిరాజ్, రవీంద్ర జడేజా నేల కూల్చారు. చివరి మూడు వికెట్లను ఇంగ్లాండ్ జట్టు 20 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం విశేషం.
రవిచంద్రన్ అశ్విన్ తన మాతృమూర్తికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అర్ధాంతరంగా చెన్నై వెళ్లాడు. అతడు లేని లోటు భారత జట్టు పై తీవ్రంగా పడుతుందని అందరూ అనుకున్నారు. పైగా డక్కెట్ జోరు మీద ఉండటంతో ఇంగ్లాండు భారీ స్కోర్ చేస్తుందని భావించారు. శుక్రవారం చేసిన 207 పరుగులకు 112 రన్స్ మాత్రమే జోడించి ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అయింది. అనంతరం భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం ఇండియా 148 పరుగుల లీడ్ లో ఉంది. కాగా, తొలి ఇన్నింగ్స్ లో భారత్ 445 పరుగులకు ఆల్ అవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు రోహిత్ శర్మ 13, యశస్వి జైస్వాల్ 9 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.