https://oktelugu.com/

Yashasvi Jaiswal: ఒక సిరీస్ లో ఇంతలా ఎవరూ కొట్టలేదు.. యశస్వి సాధించిన ఘనతలివీ

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు జైస్వాల్ ఆపద్బాంధవుడి అవతారం ఎత్తుతాడు. హైదరాబాద్, విశాఖపట్నం, రాజ్ కోట్ టెస్ట్ మ్యాచ్ లలో ఇదే నిరూపితమైంది. బంతులు వేసేది ఎంతటి కఠినమైన బౌలరయినా కసి తీరా బాదడమే జైస్వాల్ నైజం.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 9, 2024 / 04:17 PM IST

    Yashasvi Jaiswal

    Follow us on

    Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్.. ఈ 23 ఏళ్ల కుర్రాడు ఎక్కడో ఉత్తరప్రదేశ్లో పుట్టాడు. ఆర్థిక నేపథ్యం అంతంతే. ఆట మీద మమకారంతో ముంబై వచ్చాడు. నడిరోడ్డు మీద పడుకున్నాడు. దోమలతో సహవాసం చేశాడు. అర్ధాకలితో అలమటించాడు. పాల ప్యాకెట్లు వేసే దుకాణాల్లో పనిచేశాడు. ఐపీఎల్ ఢిల్లీ జట్టు కోచ్ చొరవతో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అలా ఐపిఎల్ లో మెరిశాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు టీమిండియా కు ఎంపికయ్యాడు. వైజాగ్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాజ్ కోట్ లోనూ డబుల్ బాదాడు. ఇండియా 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు.. ఇలా ఈ టెస్ట్ సిరీస్ లో 9 ఇన్నింగ్స్ లు ఆడి 712 పరుగులు చేశాడు. ఏకంగా అరంగేట్ర సిరీస్ లోనే.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారానికి ఎంపికయ్యాడు.

    హైదరాబాద్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 80 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 15 పరుగులు సాధించాడు.
    విశాఖపట్నం టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 209 పరుగులు చేసి తన టెస్ట్ కెరియర్ లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు.. అదే మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ లో లో 17 పరుగులకు అవుట్ అయ్యాడు. రాజ్ కోట్ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో 10 పరుగులు చేసి నిరాశపరచిన జైస్వాల్.. రెండవ ఇన్నింగ్స్ లో 214 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అతడు చేసిన ఈస్కోరు ఇండియా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. రాంచి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 73 పరుగులు చేశాడు. రెండవ 37 పరుగులు చేశాడు. ఇక ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 58 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు.. మొత్తంగా ఈ సిరీస్ లో 9 ఇన్నింగ్స్ లు ఆడి 712 పరుగులు పూర్తి చేశాడు..

    జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు జైస్వాల్ ఆపద్బాంధవుడి అవతారం ఎత్తుతాడు. హైదరాబాద్, విశాఖపట్నం, రాజ్ కోట్ టెస్ట్ మ్యాచ్ లలో ఇదే నిరూపితమైంది. బంతులు వేసేది ఎంతటి కఠినమైన బౌలరయినా కసి తీరా బాదడమే జైస్వాల్ నైజం. పైగా అతడి ఫుట్ వర్క్ అమోఘం. అందుకే ఈ సిరీస్ లో ఏకంగా 712 పరుగులు సాధించాడు. భారత్ సాధించిన నాలుగు టెస్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు. ” నేను గొప్ప క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. అందుకోసం ఎంతకైనా కష్టపడతాను. జట్టు విజయం సాధించినప్పుడు ఆ ఆనందం చాలా బాగుంటుంది.. దానికోసం ఇంకా మెరుగైన క్రికెట్ ఆడాలనిపిస్తుంది” అని జైస్వాల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం స్వీకరించిన తర్వాత పై వ్యాఖ్యలు చేశాడు.. ప్రస్తుతం జైస్వాల్ పేరు ట్విట్టర్లో మార్మోగుతోంది.