India Vs England: ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ జట్టుతో రాజ్ కోట్ వేదికగా మూడో టెస్ట్ ఆడుతోంది. గురువారం ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. తొలిరోజు టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా సెంచరీ తో కదం తొక్కాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 200 పై చిలుకు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరు మాత్రమే కాకుండా ఆరంగేట్ర బ్యాటర్లు సర్ఫరాజ్(62), ధృవ్ జూరెల్(46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రవిచంద్రన్ అశ్విన్ (37), జస్ ప్రీత్ బుమ్రా (26) విలువైన పరుగులు సాధించారు. తొలి రోజు జట్టు ఎన్నో ఆశలు పెంచుకున్న యశస్వి జైస్వాల్ (10), గిల్(0), రజత్ పాటి దార్(5), కుల దీప్ యాదవ్(5) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లు మార్క్ వుడ్ 4, రెహాన్ అహ్మద్ 2, అండర్సన్, హార్ట్ లీ, జో రూట్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ఓవర్ నైట్ స్కోర్ 326/5 తో రెండవ రోజు ఆట ప్రారంభించిన టీమిండియా కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. రవీంద్ర జడేజా తన స్కోర్ కు రెండు పరుగులు మాత్రమే జోడించి జో రూట్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కుల దీప్ ను అండర్సన్ అవుట్ చేశాడు. దీంతో తొలి సెషన్ లోనే భారత్ ఆల్ అవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ రవిచంద్రన్ అశ్విన్, ధృవ్ జోడి ఇంగ్లాండ్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంది. వీరిద్దరూ ఎనిమిదవ వికెట్ కు 77 పరుగులు జోడించారు. అయితే భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తున్న క్రమంలో స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ అవుతారు. ధృవ్ ఆఫ్ సెంచరీ సాధిస్తాడు అనుకుంటున్న క్రమంలో పేవిలియన్ చేరాడు. రెహాన్ అహ్మద్ బౌలింగ్లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఇక చివర్లో బుమ్రా టీ_20 తరహాలో ఆడాడు. 28 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్స్ సహాయంతో 26 పరుగులు చేశాడు. మహమ్మద్ సిరాజ్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో కాలికి బంతి తగలడంతో గాయపడ్డాడు. బుమ్రా మార్క్ వుడ్ బౌలింగ్ లో ఎల్ బీడబ్ల్యూ గా ఔట్ అయ్యాడు. ఇక భారత్ చివరి మూడు వికెట్లను 37 పరుగుల వ్యవధిలో కోల్పోవడం విశేషం. మొత్తంగా 445 పరుగులకు భారత్ ఆల్ అవుట్ అయింది. భారత బ్యాటర్లు ఇంకా కొంచెం మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే స్కోరు 500 పరుగులు దాటేది. ఉదయం వెంట వెంటనే వికెట్లు పడిపోవడంతో భారత్ 370లోపే ఆల్ అవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అశ్విన్, ధృవ్ ఇంగ్లాండ్ బౌలర్లను ప్రతిఘటించారు. కాగా, పెనాల్టీగా వచ్చిన ఐదు పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు టీ విరామం వరకు వికెట్లు ఏమి నష్టపోకుండా 31 పరుగులు చేసింది. డకెట్ 19, క్రావ్ లే 5 పరుగులతో క్రీజు లో ఉన్నారు.