India Vs England: 11, 4, 3, 7, 4, 15, 0, 2.. ఇవేంటి అని అనుకుంటున్నారా.. భారత్ విధించిన 557 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు చేసిన పరుగులు. మొదటి ఇన్నింగ్స్ సెంచరీ హీరో డక్కెట్ తేలిపోయాడు. 4 పరుగులకే ధృవ్ చేతిలో రన్ అవుట్ అయ్యాడు. మొదటి టెస్టులో సెంచరీ సాధించి ఇంగ్లాండ్ జట్టును గెలిపించిన ఓలీ పోప్ 3 పరుగులు మాత్రమే చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దిగ్గజ బ్యాటర్లైన జో రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్.. ఇలా వచ్చిన వారు వచ్చినట్టే వెళ్తుండడంతో ఇంగ్లాండ్ రాజ్ కోట్ లో ఘోరంగా ఓడిపోయింది.
భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీశాడు. కులదీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా ఒక వికెట్ దక్కించుకున్నాడు.. టీం ఇండియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏ దశలోనూ గట్టి పోటీ ఇచ్చేలా కనిపించలేదు. హేమా హేమీల్లాంటి బ్యాటర్లు ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఎటువంటి ప్రతిఘటనా కనబరచలేదు. కనీసం చెప్పుకోదగిన స్కోర్ కూడా సాధించలేదు. ఫోక్స్, హర్ట్ లీ చేసిన 16 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోర్ అంటే వారి బ్యాటింగ్ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. తొమ్మిదవ వికెట్ కు ఫోక్స్, హర్ట్ లీ జోడించిన 32 పరుగులే ఆ జట్టులో అత్యధిక భాగస్వామ్యం. ఒకానొక దశలో 50 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ జట్టును ఫోక్స్, హర్ట్ లీ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చివరికి వారిని జడేజా, అశ్విన్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది.
డక్కెట్ రూపంలో 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. మరో మూడు పరుగులు మాత్రమే జోడించి క్రావ్ లే వికెట్ నష్టపోయింది. 20 పరుగుల వద్ద పోప్ వికెట్ చేజార్చుకుంది. బెయిర్ స్టో జట్టు స్కోరు 28 పరుగుల వద్ద ఉన్నప్పుడు నాలుగవ వికెట్ గా పెవిలియన్ చేరాడు. జో రూట్, స్టోక్స్, రేయాన్ అహ్మద్ ఇలా ముగ్గురు టాప్ బ్యాటర్లు జట్టు స్కోరు 50 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒకరి వెంట ఒకరు అవుట్ కావడం విశేషం. వీరు కేవలం మూడు ఓవర్ల వ్యవధిలోనే పెవిలియన్ చేరుకోవడంతో ఇంగ్లాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్ జట్టు టాప్ ఆర్డర్ ఒకరి వెంట ఒకరు పెవిలియన్ చేరుతుండడాన్ని చూసి ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు గట్టిగా బదులిస్తారు అనుకుంటే.. ఇలా ఒకరి వెంట ఒకరు వెళ్తున్నారు ఏంటి బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మొత్తంగా ఇంగ్లండ్ 122 పరుగులకే 10 వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్ పోరాడబట్టి ఈ స్కోరు సాధించింది. బౌలర్ మార్క్ వుడ్ 15 బంతుల్లోనే 33 పరుగులు చేయడంతోనే 100 పరుగులను ఇంగ్లండ్ దాటింది. లేదంటే 100 లోపే చాపచుట్టేసేది.