India Vs Bangladesh: బంగ్లా తో టెస్ట్ సిరీస్.. ఉచితంగా ఎక్కడ చూడాలంటే..

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ తర్వాత టీమిండియాకు దాదాపు 30+ విశ్రాంతి లభించింది. రేపటి నుంచి మళ్లీ లైవ్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తోంది. గురువారం నుంచి చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడనుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 18, 2024 2:41 pm

India Vs Bangladesh(1)

Follow us on

India Vs Bangladesh: దాదాపు నెలన్నర విశ్రాంతి అనంతరం టీమిండియా ఆటగాళ్లు చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నారు. చిదంబరం మైదానంలో విశ్రాంతి లేకుండా సాధన చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ జట్టును 2-0 తేడాతో ఓడించిన బంగ్లాదేశ్… టీమిండియాను ఓడిస్తామని చెబుతోంది. అయితే బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ బదులిచ్చాడు. తాము మాటలతో కాకుండా.. పాటతీరుతో అసలైన సమాధానం చెబుతామని హెచ్చరించాడు. అయితే ఈ ప్రతిష్టాత్మకమైన సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం కాదు. అయితే ఈ మ్యాచ్ ఎక్కడ చూడాలా అని క్రికెట్ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ ప్రసార హక్కులను జియో సినిమా, స్పోర్ట్ 18 దక్కించుకున్నాయి. స్పోర్ట్స్ 18 సాటిలైట్ ఛానల్ ద్వారా ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అయితే ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాలి. ఈ డబ్బులు చెల్లించకుండా ఉచితంగా చూడాలంటే ప్రముఖ ఓటిపి ఫ్లాట్ ఫామ్ జియో సినిమాలో ఉచితంగా చూడొచ్చు. ఇటీవలి ఐపిఎల్ సీజన్ మ్యాచ్లను జియో సినిమా ఉచితంగా చూసే అవకాశం క్రికెట్ అభిమానులకు అందించింది. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ – టీమిండియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్ ను ఉచితంగా వీక్షించే సదుపాయాన్ని కల్పిస్తోంది.

సెప్టెంబర్ 19 నుంచి..

బంగ్లాదేశ్ – భారత్ మధ్య సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా తొలి టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 మధ్య రెండో టెస్ట్ జరుగుతుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా పకడ్బందీ ప్రణాళికలతో రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్ ఇటీవల పాకిస్తాన్ జట్టును 2-0 తేడాతో ఓడించిన నేపథ్యంలో.. భారత్ అప్రమత్తమైంది. ఏమాత్రం షాంటో సేనకు అవకాశం ఇవ్వకుండా.. స్ఫూర్తిదాయకమైన ఆట తీరును ప్రదర్శిస్తామని ఇప్పటికే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. మరోవైపు ఇటీవల పాకిస్తాన్ జట్టును ఓడించినట్టు.. భారత్ కు కూడా దిమ్మతిరిగే షాక్ ఇస్తామని బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో హెచ్చరించాడు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా కొద్దిరోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. స్వదేశంలో భారత జట్టును ఓడించాలనే కసితో సాధన చేస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ జట్టుతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో బంగ్లాదేశ్ అద్భుతం చేసింది. తొలి టెస్టులో ఏకంగా పది వికెట్లు తేడాతో పాకిస్తాన్ జట్టును మట్టికరిపించింది. రెండవ టెస్టులో ఆరు వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. తద్వారా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానానికి చేరుకుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా..

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీలో భాగంగా ఈ సిరీస్ జరుగుతోంది. ఒకవేళ భారత్ బంగ్లాదేశ్ జట్టును 2-0 తేడాతో ఓడిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ముందడుగు వేస్తుంది. ఫైనల్ చేరుకునే అవకాశాలను మరింత బలోపేతం చేసుకుంటుంది. బంగ్లాదేశ్ టోర్నీ తర్వాత స్వదేశంలో భారత్ న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఆ సిరీస్ లోను విజయం సాధిస్తే భారత జట్టుకు ఇక తిరుగు ఉండదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టుతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గనక సత్తా చాటితే నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోకి ఎంట్రీ ఇస్తుంది.