India vs Bangladesh : ఎర్ర మైదానంపై.. ఎరుపు రంగు బంతితో పోరు.. నేటి నుంచి భారత్, బంగ్లా తొలి టెస్ట్.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయంటే..

జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడిన భారత జట్టు.. ఆ తర్వాత ఇంతవరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. వన్డే, టీ 20 క్రికెట్ తోనే బిజీ బిజీగా గడిపింది. సుమారు 180 రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్లోకి పునరాగమనం చేస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 19, 2024 8:27 am

India vs Bangladesh

Follow us on

India vs Bangladesh : ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-2025 సీజన్ నడుస్తోంది. ఇందులో భాగంగా టీమిండియా చాలాకాలం తర్వాత టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. గురువారం నుంచి చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో తొలి టెస్ట్ ఆడనుంది. భారత జట్టు కొంతకాలంగా స్పిన్ బౌలింగ్ లో స్వేచ్ఛగా ఆడలేక పోతోంది. కీలక సమయంలో తడబడి ఇబ్బంది పడుతోంది. చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్ ను ఔట్ ఫీల్డ్ ను రెడ్ సాయిల్ తో రూపొందించారు. సాధారణంగా బ్లాక్ సాయిల్ స్పిన్ బౌలర్లకు అనుకూలిస్తుంది. కొంతకాలంగా స్పిన్ బౌలింగ్ ను ఆడలేక భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. బ్లాక్ సాయిల్ కు బదులు రెడ్ సాయిల్ ఏర్పాటు చేశారు.. దీనివల్ల స్పిన్ బౌలర్లకు మైదానం అంతగా అనుకూలించదనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక బంగ్లా బౌలర్లు ఇటీవల కాలంలో సంచలన ప్రదర్శన చేస్తున్నారు. పాకిస్తాన్ జట్టును వైట్ వాష్ చేయడంలో బంగ్లా బౌలర్లు స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన చేశారు.. అయితే సొంత దేశంలో భారత జట్టును ఓడించడం పాక్ ను పడగొట్టినంత సులభం కాదు.

బలంగా భారత్

రోహిత్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ రాకతో భారత జట్టు బలంగా కనిపిస్తోంది. గత తొమ్మిది సంవత్సరాల నుంచి విరాట్ కోహ్లీ భారత జట్టు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. విరాట్ కోహ్లీ 2021 నుంచి స్పిన్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కోలేకపోతున్నాడు. ఇప్పటికే t20 లకు శాశ్వత వీడ్కోలు ప్రకటించిన కోహ్లీ.. ఈసారి అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి… ధారాళంగా పరుగులు తీయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పిన్ బౌలర్ల పై ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు. గతంలో స్పిన్ బౌలర్లపై అటాకింగ్ ఆట తీరుతో రోహిత్ ఆకట్టుకునేవాడు.. అతడి నుంచి మెరుగైన ప్రదర్శనను భారత జట్టు ఆశిస్తోంది. మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ కు కచ్చితంగా అవకాశం దక్కేలా కనిపిస్తోంది. ఎలాంటి బౌలింగ్ అయినా రాహుల్ దీటుగా ఎదుర్కోగలడు. రాహుల్ ఇటీవల కాలంలో గొప్ప ఇన్నింగ్స్ ఆడలేదు. అతడు గనుక మైదానంలో కుదురుకుంటే భారత జట్టుకు పెద్దగా ఇబ్బంది ఉండదు.. రోడ్డు ప్రమాదానికి గురై సుదీర్ఘకాలం మంచానికే పరిమితమైన రిషబ్ పంత్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా భీకరమైన ఎదురుదాడికి దిగుతున్నాడు.

ఇబ్బంది పడుతున్నారు

ప్రమాదకరమైన గిల్, యశస్వి జైస్వాల్ స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. చెన్నై మైదానంలో కొద్దిరోజులుగా భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొనే విషయంలో తీవ్రమైన సాధన చేశారు.. చెన్నై మైదానాన్ని దృష్టిలో ఉంచుకొని టీమిండియా మేనేజ్మెంట్ అశ్విన్, జడేజా, కులదీప్ యాదవ్ కు అవకాశం ఇచ్చింది. బుమ్రా, సిరాజ్ పేస్ భారాన్ని మోస్తారు.. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కు ఇదే తొలి టెస్ట్. శ్రీలంకతో టి20, వన్డే సిరీస్ ద్వారా గౌతమ్ గంభీర్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి.. అయితే బంగ్లా టెస్ట్ లో మాత్రం ఏకపక్ష ఫలితం సొంతం చేసుకోవాలని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు.

తక్కువ అంచనా వేయొద్దు

మరో వైపు బంగ్లా జట్టు సంచలన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నది. ఇటీవల పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది. పాక్ వేదికగా జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానానికి చేరుకుంది. పాకిస్తాన్ పై సాధించిన విజయంలో బంగ్లా బౌలర్లు మిరాజ్, తైజుల్ ఇస్లాం కీలక పాత్ర పోషించారు. మరోసారి అదే స్థాయిలో బౌలింగ్ చేస్తారని బంగ్లాదేశ్ జట్టు అంచనా వేస్తోంది. బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకి బుల్ హసన్ కు భారత మైదానంపై ఆడిన అనుభవం ఉంది. లిటన్ దాస్, కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో, మోమినుల్ ఇస్లాం బంగ్లాదేశ్ బ్యాటింగ్ కు ప్రధాన బలంగా మారారు. ఓవరాల్ గా చూస్తే భారత బ్యాటింగ్, బంగ్లా స్పిన్నర్లకు మధ్య పోటీ జరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఒక్కసారి కూడా నెగ్గలేదు

భారత జట్టుతో బంగ్లా ఇప్పటివరకు 13 టెస్ట్ లు ఆడింది. ఒక్క దాంట్లో కూడా విజయం సాధించలేదు. టీమిండియా 11 మ్యాచ్ లలో విజయాలు సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్ లు డ్రా గా ముగిశాయి. 2012 నుంచి స్వదేశంలో భారత్ 17 టెస్ట్ సిరీస్ లు ఆడింది. ఇందులో ఒక్క ఓటమి కూడా లేదు. 11 సంవత్సరాల లో సొంత గడ్డపై 40 మ్యాచ్ లను భారత్ నెగ్గింది. నాలుగు మ్యాచ్ లలో మాత్రమే ఓడిపోయింది.

ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత..

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై 632 రోజుల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. 2022లో బంగ్లా జట్టుతో అతడు చివరి టెస్ట్ ఆడుతున్నాడు. ఆ తర్వాత అతడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చాలా రోజులపాటు మంచానికి పరిమితమయ్యాడు. ఐపీఎల్ ద్వారా క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ పూర్తయిన తర్వాత.. టెస్టుల్లోకి పునరాగమనం చేస్తున్నాడు. అయితే అది కూడా బంగ్లాదేశ్ జట్టు పైన కావడం విశేషం.

జట్ల అంచనా ఇలా

భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, విరాట్ కోహ్లీ, రాహుల్, రిషబ్ పంత్.

బంగ్లాదేశ్

షాంటో (కెప్టెన్), నహీద్ రాణా/ తైజుల్, మిరాజ్, తస్కిన్, హసన్ మహమూద్, షద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ ఇస్లాం. లిటన్ దాస్. షకీబుల్.

పిచ్/ వాతావరణం

ఎర్ర మట్టి మైదానం కావడంతో తొలిరోజు బంతి బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. స్పిన్న, పేస్ బౌలర్లకు సహకరించి అవకాశం ఉంది. మ్యాచ్ జరుగుతున్నంతసేపు బంతి అనూహ్యంగా టర్న్ అయ్యేందుకు అవకాశం ఉంది. తొలి రోజు వర్షం పడే ప్రమాదం లేకపోలేదు. ఉదయం వర్షం కురిసేందుకు 25% అవకాశం ఉంది. మధ్యాహ్నం వర్షం కురవడానికి 46% అవకాశం ఉంది.

మ్యాచ్ ఎక్కడ చూడొచ్చు అంటే: స్పోర్ట్స్ 18 ఛానల్ లో.. మ్యాచ్ ప్రసారం అయ్యేది ఉదయం 9:30 నుంచి. ఓటీటీ లో అయితే జియో సినిమాలో ఉచితంగా చూడొచ్చు.