Vineet Kumar: ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో మార్మోగిపోతున్న సినిమా పేరు ఏదన్నా ఉందంటే అది ఛావా అనే చెప్పాలి. స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రాలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ ఎమోషనల్ మూవీ ఒక్క భాషలోనే విడుదలై పాన్ ఇండియా లెవల్లో మార్మోగిపోతుంది. అయితే దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. వీక్ డేస్ లోకి వచ్చినప్పటికీ కూడా స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కూడా రూ.30 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించి అదరగొట్టేసింది. అయితే కొన్ని ఏరియాల్లో అయితే డే 1 కంటే డే 6 వసూళ్లే ఎక్కువగా వచ్చాయని టాక్.
దీనితో ఛావా మూవీ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఈ వీకెండ్ కల్లా 300 కోట్ల క్లబ్ లో చేరిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని భారీ వసూళ్లు అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. యేసుబాయి, ఔరంగజేబు పాత్రలు పోషించిన రష్మిక, అక్షయ్ ఖన్నాల నటనకు ముగ్ధులవుతున్నారు. ఇక ఇందులో కవి కలాష్ పాత్రలో నటించిన వినీత్ కుమార్ కు మంచి మార్కులే పడ్డాయి. శంభాజీతో పాటు, కవి కలాష్‌ను మొగల్ సేనలు బంధీని చేస్తాయి. ఆ తర్వాత హింసించి చంపేస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ శంభాజీ, కవి కలాష్‌ల మధ్య జరిగే సంభాషణ భావోద్వేగానికి మనసుకు హత్తుకుపోయింది. కంటి నీరు పెట్టించేలా అద్భుతంగా నటించారు ఈ ఇద్దరూ. మరి అలాంటి ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
వినీత్ కుమార్ సింగ్ యూపీలోని వారణాసిలో జన్మించాడు. తన తండ్రి గణిత శాస్త్రజ్ఞుడు. వినీత్ కు చిన్నప్పటి నుంచి బాస్కెట్ బాల్ అంటే ఎంతో ఇష్టం. వినీత్ జాతీయ స్థాయిలో క్రీడాకారుడిగా రాణించాడు. కంబైన్డ్ ప్రీ మెడికల్ టెస్ట్ (సీపీఎంటీ) క్వాలిఫై అవడమే కాదు వినీత్ మెడికల్ కాలేజ్ టాపర్‌గానూ నిలిచాడు. ఆర్‌ఏ పొద్దార్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ ఆయుర్వేద, మెడిసన్ అండ్ సర్జరీలను పూర్తి చేశాడు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నాగ్‌పుర్‌లో ఎండీ చేశారు. 2002లో సంజయ్‌దత్ నటించిన ‘పితః’ చిత్రంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్’ చిత్రం వినీత్ కు మాంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ‘ముక్కాబాజ్’లో నటనకు గానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.
ప్రస్తుతం ‘జాట్’, ‘సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్’ చిత్రాలలో నటిస్తున్నారు.