India Vs Australia: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం సెయింట్ లూయిస్ వేదికగా జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. 24 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 రన్స్ బాదాడు. అనంతరం 206 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు, ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మూడు సంఘటనలు భారత జట్టు గమనాన్ని పూర్తిగా మార్చాయి.
మూడో ఓవర్ లో 29 పరుగులు
తొలి ఓవర్ లో మిచెల్ స్టార్క్ కట్టదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత హజిల్ వుడ్ రెండో ఓవర్ వేశాడు. కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చి, విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్ స్టార్క్ వేశాడు ఈ ఓవర్ లో రోహిత్ ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు. స్టార్క్ వేసిన తొలి బంతిని డీప్ ఎక్స్ ట్రా కవర్ మీదుగా సిక్సర్ కొట్టాడు. రెండో బంతిని అదేవిధంగా సిక్సర్ బాదాడు. మూడవ బంతిని ఫోర్ గా మలిచాడు. నాలుగో బంతిని మరింత బలంగా కొట్టాడు. దీంతో 100 మీటర్ల ఎత్తు నుంచి ఆ బంతి స్టేడియం అవతల పడింది. ఐదో బంతిని స్టార్క్ తెలివిగా వేయడంతో డాట్ అయింది. ఆరో బంతిని వైడ్ గా వేసిన స్టార్క్.. ఆ చివరి బంతిని కూడా రోహిత్ సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్ తో మ్యాచ్ గమనం పూర్తిగా మారిపోయింది.
అక్షర్ పటేల్ క్యాచ్
తొలి ఓవర్ చివరి బంతికే ఆస్ట్రేలియా వార్నర్ వికెట్ కోల్పోయిన నేపథ్యంలో.. కెప్టెన్ మార్ష్ క్రీజ్ లోకి వచ్చాడు. మరో ఓపెనర్ హెడ్ తో కలిసి దూకుడుగా ఆడాడు. ఏకంగా రెండో వికెట్ కు ఏడు ఓవర్లలో 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని కులదీప్ యాదవ్ విడదీశాడు. ఎనిమిదో ఓవర్ చివరి బంతిని మార్ష్ గట్టిగా కొట్టాడు. దీంతో ఆ బంతి స్టాండ్స్ లోకి వెళ్లేలా కనిపించింది. అక్కడే బౌండరీ లైన్ వద్ద ఉన్న అక్షర్ పటేల్ ఒంటి చేత్తో బంతిని అమాంతం అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా మార్ష్ బిత్తరపోయాడు. మార్ష్ కనుక ఔట్ అయి ఉండకుంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది.
హెడ్ ఔట్
మార్ష్ ఔట్ అయినప్పటికీ.. క్రీజ్ లో హెడ్ ఉండటంతో భారత జట్టులో ఒకింత ఆందోళనే ఉంది. అతడికి మాక్స్ వెల్ కూడా తోడు కావడంతో ఆస్ట్రేలియా స్కోర్ పరుగులు తీస్తూనే ఉంది. ఈ క్రమంలో కులదీప్ వేసిన ఒక అద్భుతమైన బంతికి మాక్స్ వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టోయినీస్ పెద్దగా ప్రభావం చూపించకుండానే అక్షర్ పటేల్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ దశలో బంతి అందుకున్న బుమ్రా హెడ్ ను బోల్తా కొట్టించాడు. బుమ్రా వేసిన బంతిని భారీ షాట్ కొట్టేందుకు హెడ్ ప్రయత్నించాడు. అది అమాంతం గాల్లో లేవడంతో.. కెప్టెన్ రోహిత్ శర్మ ఒడిసి పట్టుకున్నాడు. దీంతో భారత్ కాస్త ఊపిరి పీల్చుకుంది. అప్పటికి సాధించాల్సిన రన్ రేట్ పెరగడం.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో ఆస్ట్రేలియా ఓటమి బాట పట్టింది.