India vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ ప్రీత్ బుమ్రా తన మాయాజాలాన్ని కొనసాగిస్తున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు మూడు వికెట్లు పడగొట్టాడు.. ఖవాజా, మెక్ స్వీనే, స్మిత్ వికెట్లను బుమ్రా పడగొట్టాడు. అయితే రెండవ రోజు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా ప్రమాదకర ఆటగాడు స్టీవెన్ స్మిత్ ను దారుణంగా బోల్తా కొట్టించాడు. బుమ్రా వేసిన వలలో చిక్కుకొని స్మిత్ విలవిలాడిపోయాడు. చివరికి పెవిలియన్ చేరుకున్నాడు. శనివారం రెండో రోజు ఆట ప్రారంభంలోనే ఆస్ట్రేలియా యువ ఆటగాడు మెక్ స్వీనీ ని పెవిలియన్ పంపించాడు. అనంతరం స్మిత్ క్రీజ్ లోకి వచ్చాడు. తొలి టెస్ట్ లో స్మిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఇక రెండో టెస్టులోనైనా అతడు ఆడతాడని అభిమానులు ఆశించారు. కానీ అతడు ఊహించిన విధంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. చివరికి అత్యంత దారుణంగా బుమ్రా చేతిలో అవుట్ అయ్యాడు.
బుమ్రా పాచిక పారింది ఇలా..
బుమ్రా.. స్మిత్ మైదానంలోకి రాగానే తన బౌలింగ్ స్టైల్ పూర్తిగా మార్చేశాడు.. అప్పటిదాకా వేసిన విధంగా కాకుండా ఓవర్ ద వికెట్ నుంచి హాఫ్ స్టంప్ చుట్టూ బంతులు వేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా గుడ్ లెంగ్త్ డెలివరీలను వేశాడు. దీంతో స్మిత్ తన ఉన్న చోటు నుంచి హాఫ్ స్టాంపు దిశగా వచ్చి బ్యాటింగ్ చేయడం ప్రారంభించాడు. అయితే బుమ్రా మరోసారి స్మిత్ వికెట్ పడగొట్టేందుకు సరికొత్త ప్రణాళికలను అమలు చేశాడు. 41 ఓవర్ వేసిన బుమ్రా.. తన తొలి బంతిని లెగ్ స్టంప్ దిశగా వేశాడు. బంతి అలా వేస్తాడని ఊహించని స్మిత్.. డౌన్ లెగ్ వైపు బంతిని కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. వెంటనే వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఫలితంగా స్మిత్ వికెట్ పడిపోయింది. దీంతో స్మిత్ మరోసారి బుమ్రా చిక్కాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో.. రెండు ఇన్నింగ్స్ లోనూ బుమ్రా చేతిలోనే స్మిత్ అవుట్ కావడం విశేషం. కొంతకాలంగా సరైన ఫామ్ కనబరచడం లేదు. మెరుగైన ఇన్నింగ్స్ ఆడటం లేదు. అయితే వరుసగా రెండు టెస్టుల్లో విఫలమైన నేపథ్యంలో.. వచ్చే మ్యాచ్లో అతడికి స్థానం ఉంటుందా? లేదా? అనేది అనుమానమేనని ఆస్ట్రేలియా అభిమానులు పేర్కొంటున్నారు. కాగా, ఈ సిరీస్ లో బుమ్రా రెచ్చిపోయి బౌలింగ్ వేస్తున్నాడు. ఇప్పటివరకు 11 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ఈ క్యాలెండర్ ఇయర్లో 50 కంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్, కమిన్స్ లాంటి బౌలర్ల సరసన బుమ్రా నిలిచాడు.. అయితే అతడు ఇదే జోరుకొండ సాగిస్తే.. మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉంది.
— Sunil Gavaskar (@gavaskar_theman) December 7, 2024