India Vs Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ కు అంత ఈజీ కాదు.. న్యూజిలాండ్ కు ఎలాంటి ఫలితం ఎదురయిందో తెలుసు కదా?

లీగ్ దశలో స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆఫ్ఘనిస్తాన్.. భారత జట్టుకు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ మ్యాచ్ లో భారత జట్టు ఫేవరెట్ అయినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ జట్టును అంత తేలిగ్గా తీసిపారేయడానికి లేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 20, 2024 12:53 pm

India Vs Afghanistan

Follow us on

India Vs Afghanistan: టి20 వరల్డ్ కప్ లో చిన్న జట్లు పెను సంచలనాలను నమోదు చేశాయి. అందులో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఒకటి. ఈ జట్టు లీగ్ మ్యాచ్ లలో న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించింది. ఫలితంగా ఆ జట్టు లీగ్ దశలోనే ఇంటికి వెళ్ళింది. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం అనితర సాధ్యమైన ఆటతీరుతో సూపర్ -8 దాకా వచ్చింది. తొలి మ్యాచ్ లో భాగంగా భారత జట్టుతో తలపడబోతోంది. లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ -8 లోకి ప్రవేశించిన రోహిత్ సేన.. ఆఫ్ఘనిస్తాన్ ను ఎలా అడ్డుకుంటుందనేది ఆసక్తికరం.

లీగ్ దశలో స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆఫ్ఘనిస్తాన్.. భారత జట్టుకు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ మ్యాచ్ లో భారత జట్టు ఫేవరెట్ అయినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ జట్టును అంత తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. అమెరికాతో పోల్చితే వెస్టిండీస్ మైదానాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు గురువారం మ్యాచ్ జరిగే బార్బడోస్ మైదానంపై భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎటువంటి మార్పులు చేయకుండానే ఆఫ్ఘనిస్తాన్ తో తల పడతామని చెబుతున్నాడు. ఈ మ్యాచ్ లోనూ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కులదీప్ యాదవ్ కు అవకాశం ఇస్తే, మహమ్మద్ సిరాజ్ రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావాల్సి ఉంటుంది.

ఇక ఈ మ్యాచ్ లో అందరి దృష్టి మొత్తం విరాట్ కోహ్లీ పైనే ఉంది. ఎందుకంటే అతడు గత మూడు మ్యాచ్లలో తేలిపోయాడు. గత టి20 వరల్డ్ కప్ లో, ఇటీవలి ఐపిఎల్ లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించాడు. ఈసారి వరల్డ్ కప్ లో ఆశించినంత స్థాయిలో ఆడలేక పోతున్నాడు. న్యూయార్క్ లో ప్రత్యర్థి బౌలర్ల పై ఎదురుదాడి చేద్దామనుకొని.. వెంటనే పెవిలియన్ చేరుకున్నాడు. అయితే కరేబియన్ మైదానాలపై విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది. మరోవైపు డాషింగ్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ అమెరికాతో జరిగిన మ్యాచ్లో టచ్లోకి వచ్చాడు. శివం దూబే, రవీంద్ర జడేజా తమ స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయాల్సి ఉంది. బౌలింగ్లో అర్ష్ దీప్ సింగ్ పర్వాలేదనిపిస్తుండగా.. బుమ్రా తన స్టైల్లో రెచ్చిపోతున్నాడు. ఒకవేళ బార్బోడోస్ మైదానం మందకొడిగా ఉంటే మాత్రం అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా అద్భుతాలు చేయగలరు.

ఇక ఆఫ్గనిస్తాన్ జట్టు మంచి హుషారు మీద ఉంది. చివరి గ్రూప్ మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. ఈసారి ఎలాగైనా సెమిస్ వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ అంటున్నాడు. నవీనుల్, ఫజల్ మెరుగ్గా బౌలింగ్ వేస్తుండగా, గుర్బాజ్, జద్రాన్ బ్యాటింగ్లో సత్తా చాటుతున్నారు. న్యూజిలాండ్ కెప్టెన్ లీగ్ దశలో ఓడించినట్టు.. అలాంటి ఫలితమే మరోసారి పునరావృతం చేయాలని ఆఫ్ఘనిస్తాన్ జట్టు భావిస్తోంది.

ఇక ఈ మైదానం మందకొడిగా ఉంది. స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే వేగంగా బంతులు వేసిన బౌలర్లకు ఎక్కువ వికెట్లు లభించాయి. ఈ మైదానం వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 201 పరుగులు చేసింది. వర్షం కురుస్తుందని చెబుతున్నప్పటికీ.. అది ఆటకు ఆటంకం కలిగించదని తెలుస్తోంది.

జట్ల అంచనా ఇలా

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, కులదీప్ యాదవ్/ మహమ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్.

ఆఫ్ఘనిస్తాన్

రషీద్ ఖాన్ (కెప్టెన్), గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఓమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, నబీ, కరీం జనత్, గుల్బాదిన్ నైబ్, ఫజల్ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్.