India Test Captain Announcement: ఇవన్నీ కూడా జట్టు మేనేజ్మెంట్ ను తీవ్రంగా ఇబ్బందిగా గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కివీస్ తో గత ఏడాది స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ కావడం ఇప్పటికి మేనేజ్మెంట్ కు రుచించడం లేదు. సెలక్షన్ కమిటీకి అంతుపట్టడం లేదు. అదే తలమీద మొట్టికాయలాగా ఉంటే.. కంగారులతో జరిగిన బి జి టి సిరీస్ మరింత దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. తొలి టెస్ట్ లో ఘనవిజయం సాధించినప్పటికీ.. అదే టెంపో కంటిన్యూ చేయడంలో టీమిండియా దారుణంగా విఫలమైంది. ఈ రెండు వైఫల్యాలు టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ అవకాశాలను గండి కొట్టాయి. ఫలితంగా టెస్ట్ జట్టులో చేపట్టాల్సిన మార్పులు అనివార్యమైపోయాయి.
జట్టు వైఫల్యాలు ఓవైపు ఇబ్బంది పడుతుంటే.. కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలో వచ్చే నెలలో ఇంగ్లీషు జట్టుతో జరిగే ఐదు టెస్టుల సీరీస్ కోసం కొత్త సారధిని ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జట్టుకూర్పు ఎలా ఉంటుంది? కొత్త సారధిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఉత్కంఠ గా మారింది.
ప్రస్తుతం జట్టులో బుమ్రా, రవీంద్ర జడేజా సీనియర్ ప్లేయర్లుగా ఉన్నారు. ఇక యువ ప్లేయర్లలో గిల్, రిషబ్ పంత్ సుదీర్ఘ ఫార్మాట్లో అదరగొడుతున్నారు. జట్టులో యువ రక్తం ఎక్కించాలనుకుంటే గిల్ లేదా పంత్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సీనియర్ ప్లేయర్లకు అవకాశం కల్పించాలి అనుకుంటే బుమ్రా లేదా రవీంద్ర జడేజాకు నాయకత్వం అప్పగిస్తారని తెలుస్తోంది. అయితే బుమ్రా తరచూ గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో.. అతడిని వైస్ కెప్టెన్ గా ఉంచి.. గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం లేకపోలేదు.. మరోవైపు శనివారం బిసిసిఐ సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్ విలేకరుల సమావేశంలో.. ఇంగ్లీష్ జట్టుతో జరిగే ఐదు టెస్టుల సిరీస్ కు ఆటగాళ్లను ప్రకటిస్తారని.. అదే సమయంలో టెస్ట్ జట్టు నూతన సారధి పేరు కూడా వెల్లడిస్తారని తెలుస్తోంది.
ఇంగ్లీష్ జట్టుతో జరిగే ఐదు టెస్టుల సిరీస్ గెలవడం టీమిండియా కు చాలా అవసరం. మరోవైపు 2025 -27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్ ను ఇంగ్లీష్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ ద్వారా టీమ్ ఇండియా మొదలుపెడుతుంది. ఒక రకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్ లో టీమిండియా ఇంగ్లీష్ జట్టుతో ఆడే సిరీస్ పెద్దది. ఈ ఐదు టెస్టులలో టీమిండియా కనుక విజయం సాధిస్తే సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతుంది. అందువల్లే జట్టు ఎంపికలో.. సారధి నియామకంలో మేనేజ్మెంట్ తీవ్రంగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.