India Vs New Zealand: 2025 లో టీమిండియా వన్డేలలో మెరుగైన ఫలితాలు సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో ఓటమిపాలైనప్పటికీ.. మిగతా సిరీస్లలో ఆ ప్రభావాన్ని చూపించలేదు. మొత్తంగా వైట్ బాల్ ఫార్మాట్లో టీమ్ ఇండియా దుమ్మురేపింది. అయితే 2026లో టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డే, టి20 సిరీస్ ద్వారా తెల్ల బంతితో యుద్ధాన్ని మొదలుపెట్టబోతోంది.
వన్డేలో, టి20 లలో టీమిండియా ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒకరకంగా న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా కు మెరుగైన రికార్డు ఉంది. 2024 సంవత్సరంలో స్వదేశం వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా వైట్ వాష్ కు గురైంది. ఆ పరా భవానికి సరైన సమాధానం చెప్పాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో 2026 లో ప్రారంభమయ్యే వన్డే, టి20 సిరీస్ లలో న్యూజిలాండ్ జట్టుకు బుద్ధి చెప్పాలని బలంగా కోరుకుంటుంది.
న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ కు జనవరి మూడు లేదా నాలుగు తేదీల్లో జట్టను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్లో కొంతమంది ప్లేయర్లకు అవకాశం దక్కదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బుమ్రా, హార్దిక్ పాండ్యాను పక్కన పెడతారని ప్రచారం జరుగుతోంది. అయితే కేవలం వారిద్దరు మాత్రమే కాదని, మొత్తంగా ఐదుగురు ప్లేయర్లను దూరం పెడుతున్నారని తెలుస్తోంది…
గాయం కారణంగా హార్దిక్ పాండ్యాను న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ కు ఎంపిక చేయడం లేదని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా క్వాడ్రి సెప్స్ గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడు న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ కు ఎంపికయ్యే అవకాశం లేదని సమాచారం. ఫిబ్రవరిలో జరిగే టి20 వరల్డ్ కప్ కోసం అతడికి మేనేజ్మెంట్ విశ్రాంతి ఇస్తున్నట్టు తెలుస్తోంది. అతడి స్థానంలో ఆల్రౌండర్ కోటాలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డికి చోటు లభించవచ్చని సమాచారం..
ఇటీవల బుమ్రా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో టి20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని అతడికి న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ కోసం ఎంపిక చేయకపోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. అతని మీద వర్క్ లోడ్ వేయడం మేనేజ్మెంట్ కు ఏమాత్రం ఇష్టం లేదు. అతని స్థానంలో హర్షిత్ రాణా కు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతుంది.
సౌత్ ఆఫ్రికా సిరీస్లో వాషింగ్టన్ సుందర్ దారుణంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్ లలో అతడు 14 పరుగులు చేశాడు. బౌలింగ్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అతని స్థానంలో అక్షర్ పటేల్ కు చోటు లభిస్తుందని తెలుస్తోంది.
సౌత్ ఆఫ్రికా సిరీస్ లో జట్టులో చోటు లభించినప్పటికీ.. తుది జట్టులో మాత్రం తిలక్ వర్మ కు అవకాశం లభించలేదు. రుతు రాజ్ గైక్వాడ్ సెంచరీ చేసిన నేపథ్యంలో తిలక్ స్థానం జట్టులో ప్రశ్నార్థకంగా మారిపోయింది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా గాయం నుంచి కోలుకున్నాడు. జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. దీంతో వన్డే జట్టులో తిలక్ వర్మకు చోటు లభించకపోవచ్చు అని ప్రచారం జరుగుతోంది.
రిషబ్ పంత్ కొంతకాలంగా వన్డేలు ఆడటం లేదు. అతడిని న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ కోసం మేనేజ్మెంట్ పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ లో ఉన్న నేపథ్యంలో.. పంత్ కూడా వన్డే జట్టులో చోటుపై ఆశలు వదిలేసుకున్నట్టు తెలుస్తోంది.
న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ లో గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్, జైస్వాల్, గైక్వాడ్, జడేజా, కులదీప్ యాదవ్, ప్రసిద్ ఎంపికైనట్టు తెలుస్తోంది. జనవరి 11న వన్డే సిరీస్ మొదలవుతుంది. జనవరి 11న వడోదర, జనవరి 14న రాజ్కోట్, జనవరి 18న ఇండోర్ లో వన్డే మ్యాచ్లు జరుగుతాయి.