Virat Kohli: విరాట్ కోహ్లీ గురించి.. అతడి ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి మైదానంలోనైనా అతడు ఆడుతాడు. ప్రత్యర్థి బౌలర్ ఎంతటి తోపైనా సరే.. తన బ్యాట్ ముందు జుజుబి చేస్తాడు. అందువల్లే విరాట్ కోహ్లీని సమకాలీన క్రికెట్లో పరాక్రమవంతుడు అని పిలుస్తారు.
విరాట్ కోహ్లీ టీ20, టెస్ట్ ఫార్మాట్లకు శాశ్వత వీడ్కోలు పలికాడు. వన్డే జట్టులో మాత్రమే అతడు కొనసాగుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన సిరీస్లో పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. సెంచరీల మోత మోగించాడు. వన్డే వరల్డ్ కప్ లో అతడిని జట్టులోకి తీసుకోవడం దండగ అన్న వాళ్ళ నోళ్లను మూయించాడు. ప్రస్తుతం డొమెస్టిక్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ సంచలనాలు సృష్టిస్తున్నాడు. అంచనాలకు మించి ఆడుతూ అదరగొడుతున్నాడు. అంతేకాదు ఇదే ఊపులో న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కు ముందు అభిమానులకు అద్భుతమైన కానుక అందించాడు.
విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కంటే ముందు మరొకసారి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇటీవల అతడు విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఢిల్లీ జట్టు కు ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ జట్టు తరఫున రెండు మ్యాచ్లు ఆడాడు. ఇప్పుడు ఇదే టోర్నీలో మరో మ్యాచ్ ఆడబోతున్నట్టు తెలుస్తోంది.
జనవరి ఆరవ తేదీన ఆలూరు రైల్వేస్ జట్టుతో జరిగే మ్యాచ్లో విరాట్ అందుబాటులో ఉంటాడని ఇప్పటికే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కోసం జనవరి 7న భారత జట్టును బరోడా ప్రాంతంలో కలుసుకుంటాడు. న్యూజిలాండ్ జట్టుతో భారత్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. జనవరి 11 నుంచి ఈ సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్ కోసం కొద్ది రోజుల్లోనే భారత జట్టును ప్రకటించబోతున్నారు. గడిచిన 6 ఇన్నింగ్స్ లలో విరాట్ కోహ్లీ మూడు సెంచరీలు చేశాడు. మూడు హాఫ్ సెంచరీలు కొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడిన విరాట్ ఆంధ్ర జట్టుపై 131 పరుగులు.. గుజరాత్ గట్టుపై 77 పరుగులు చేశాడు. సౌత్ ఆఫ్రికా జరిగిన వన్డే సిరీస్ లో ఏకంగా రెండు సెంచరీలు చేశాడు. ఒక హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్లో 74 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.