Paris Olympics 2024 : టోక్యో ఒలంపిక్స్ లో స్వర్ణం దక్కించుకుని.. పరువు కాపాడుకున్న భారత్.. పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. దిగ్గజ అథ్లెట్లు సత్తా చాటడంలో విఫలమయ్యారు. ఒక స్వర్ణ కూడా సాధించలేకపోవడంతో భారత్ మెడల్స్ జాబితాలో 71 స్థానంలో నిలవాల్సి వచ్చింది. జనాభాతో పోల్చితే హైదరాబాదులో సగానికి కంటే తక్కువగా ఉండే న్యూజిలాండ్ 10 గోల్డ్ మెడల్స్ సాధించింది. 140 కోట్ల జనాభా ఉన్న భారత మాత్రం ఒక్క గోల్డ్ మెడల్ కూడా దక్కించుకోలేకపోయింది. చివరికి మన శత్రుదేశం పాకిస్తాన్ గోల్డ్ మెడల్ సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించింది.. మన దేశ అథ్లెట్లు ఒక రజతం, ఐదు కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. టోక్యోలో జరిగిన ఒలంపిక్స్ లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు సాధించిన భారత క్రీడాకారులు.. పారిస్ లో ఆశించినంత స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయారు. మెడల్స్ ఖాతా తెరిచిన 84 దేశాల్లో భారత 71 స్థానంలో ఉండడాన్ని దేశంలోని క్రీడాభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
470 కోట్లు ఖర్చు చేసింది
రియో ఒలంపిక్స్ లో భారత్ రెండు మెడల్స్ మాత్రమే సాధించింది. టోక్యోలో మాత్రం ఏడు మెడల్స్ సాధించి సత్తా చాటింది. ఈ క్రమంలో క్రీడల్లో భారత్ పురోగతి సాధించిందని అందరూ భావించారు. భవిష్యత్తులో క్రీడారంగాన్ని శాసిస్తుందని అనుకున్నారు. పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్ లో మెడల్స్ సంఖ్య డబుల్ డిజిట్ దాటుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం కూడా గదానికంటే భిన్నంగా భారీగా ఖర్చుపెట్టింది. క్రీడాకారుల కోసం సకల సౌకర్యాలు కల్పించింది. అన్ని విధాలుగా అండగా నిలిచింది. గత మూడు సంవత్సరాలలో దాదాపు 470 కోట్లను భారత్ ఖర్చు పెట్టింది.. ఇందులో అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం 96.08 కోట్లు ఖర్చుపెట్టింది. బ్యాట్మెంటన్ కు 72. 02 కోట్లు, బాక్సింగ్ కు 60.93 కోట్లు, షూటింగ్ కు 60.42 కోట్లు ఖర్చు చేసింది.
బ్యాడ్మింటన్ లో భారత్ ఒక మెడల్ కూడా దక్కించుకోలేదు. అథ్లెటిక్స్ లో నీరజ్ ఒక్కడే రజతం గెలిచాడు. అందరూ ఊహించినట్టుగానే షూటింగ్ భాగంలో మూడు మెడల్స్ వచ్చాయి. హాకీలో మరోసారి కాంస్యం లభించింది. రెజ్లింగ్ విభాగంలో అమన్ ఒక కాంస్యం దక్కించుకున్నాడు. బాక్సింగ్, బ్యాడ్మింటన్, ఆర్చరీలో నిరాశ ఎదురయింది. రెజ్లింగ్ లో వినేశ్ ఫొగాట్ 100 గ్రాములు అధికంగా బరువు ఉండటంతో కుస్తీ పోటీల్లో ఫైనల్ ఆడలేకపోయింది. డిస్ క్వాలిఫై అయింది. షూటింగ్ భాగంలో మను భాకర్ – అనంత్ – మహేశ్వరి, అర్జున్, ధీరజ్ – అంకిత (ఆర్చరీ), మీరాబాయి చాను(వెయిట్ లిఫ్టింగ్), లక్ష్యసేన్ (బ్యాట్మెంటన్) వెంట్రుకవాసిలో మెడల్స్ కోల్పోయారు. మరోవైపు భారత క్రీడాకారుల కోసం 470 కోట్లు ఖర్చు చేసిన నేపథ్యంలో.. వచ్చిన మెడల్స్ ఆరు మాత్రమేనని.. ఒక్కో మెడల్ కోసం 78 కోట్లు ఖర్చుపెట్టిందని.. ఇది చాలా ఖరీదైన వ్యవహారం అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More