టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ లో ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల ఆశలు వమ్ము చేశారు. కప్ తెస్తుందనుకున్న జట్టు ఉట్టి చేతులతో రావడంతో నిరాశ చెందారు. ఆల్ రౌండ్ ప్రతిభతో అదరగొడుతుందనుకున్న జట్టు కీలక సమయంలో వెన్నుచూపి తిరిగి రావడం అభిమానులకు మింగుడు పడటం లేదు. దీంతో అందరిపై విమర్శలు చేశారు. మొత్తానికి టీమిండియా అప్రదిష్ట మూటగట్టుకుంది.

పాకిస్తాన్, న్యూజీలాండ్ చేతిలో ఘోర పరాభవంతో జట్టు సెమీస్ ఆశలు సన్నగిల్లాయి. ఏదో మూల ఉన్న ఆశ కూడా ఆవిరి కావడంతో సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. పాకిస్తాన్ తో ఓడినా న్యూజీలాండ్ తో విజయం సాధిస్తుందని భావించినా ఓటమి అభిమానులను విపరీతంగా బాధించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.
ఇక సెమీస్ ఆశలకు గండి పడటంతో నామమాత్రపు మ్యాచ్ నమీబియాతో జరగనుంది. దీనికి టీమిండియా సన్నద్ధమవుతోంది. పసికూన పై పరుగుల వరద పారించాలని వ్యూహాలు రచిస్తోంది. చెలరేగి ఆడి విజయంతో టూర్ ముగించాలని చూస్తోంది. ఇందులో భాగంగా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చేందుకు ఆలోచిస్తోంది. నమీడియాతో ఆడే జట్టుపై కసరత్తు చేస్తోంది.
బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తోనే ఆరంభించనున్నట్లు తెలుస్తోంది. తరువాత కోహ్లిని రంగంలోకి దించనుంది. అనంతరం సూర్యకుమార్ యాదవ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించనుంది. తరువాత స్థానాల్లో రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యాలు రానున్నట్లు సమాచారం. టీమిండియా ప్రయోగాలు చేయడానికి నిర్ణయించుకుంది.
ఈ టోర్నీలో ఇంతవరకు రాణించని మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో రాహుల్ చాహర్ కు అవకాశం దక్కనుందని తెలుస్తోంది. నమీబియాను తక్కువ స్కోరుకే కట్టడి చేసి తాను మాత్రం భారీ స్కోరు చేసే దిశగా ప్రయత్నాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి భారీ విజయంతో పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.