India Vs Sri lanka T20: సూర్య మలుపు తిప్పాడు.. రింకూ సింగ్ సత్తా చాటాడు.. భారత్ గెలుపునకు దోహదం చేసింది అవే..

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 137 రన్స్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి పై పరుగులు చేసింది. గిల్ 39, రియాన్ పరాగ్ 26, వాషింగ్టన్ సుందర్ 25 పరుగులు చేసి ఆకట్టుకున్నారు..

Written By: Anabothula Bhaskar, Updated On : July 31, 2024 12:17 pm

India Vs Sri lanka T20

Follow us on

India Vs Sri lanka T20: దక్షిణాఫ్రికా పై ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి టి20 వరల్డ్ కప్ గెలిచింది. జింబాబ్వే పై t20 సిరీస్ నెగ్గింది. శ్రీలంకతో జరిగిన మూడు t20 మ్యాచ్ ల సిరీస్ కూడా 3-0 తేడాతో దక్కించుకుంది. కొత్త కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో టీమిండియా తొలి అడుగులు క్లీన్ స్వీప్ తో వేసింది. మంగళవారం ఉత్కంఠగా సాగిన చివరి t20 మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ సేన సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించింది. వాస్తవానికి ఈ మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే వాటిని ఆ జట్టు చేతులారా నాశనం చేసుకుంది. 12 బంతుల్లో 9 పరుగులు చేయలేక చేతులెత్తేసింది. ఐదు వికెట్లు ఉంచుకొని కూడా తలవంచింది.. టీమిండియా పార్ట్ టైం స్పిన్నర్లు సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ మెలి తిప్పే బంతులు వేయడంతో శ్రీలంక బ్యాటర్లు వణికిపోయారు. బంతిని టచ్ చేసే సాహసం చేయలేక చేతులెత్తేశారు. సూర్య, రింకూ వల్ల ఓడిపోవాల్సిన మ్యాచ్ ను భారత్ దక్కించుకుంది. అద్భుతంగా విజయాన్ని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. మరోవైపు సూపర్ ఓవర్ లో వాషింగ్టన్ సుందర్ లంకా దహనాన్ని సంపూర్ణంగా చేశాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 137 రన్స్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి పై పరుగులు చేసింది. గిల్ 39, రియాన్ పరాగ్ 26, వాషింగ్టన్ సుందర్ 25 పరుగులు చేసి ఆకట్టుకున్నారు.. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా రెండు, తీక్షణ మూడు వికెట్లు పడగొట్టారు. విక్రమసింగే, అసిత, రమేష్ మెండిస్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం 138 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 137 రన్స్ చేసింది. అటు భారత్ – ఇటు శ్రీలంక స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. శ్రీలంక బాటర్లలో కుశాల్ మెండిస్ 43, ఫెరీరా 46, నిస్సాంక 26 పరుగులతో అలరించారు. రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, సూర్య కుమార్ యాదవ్, రింకు సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. అయితే తొలి బంతిని వాషింగ్టన్ సుందర్ వైట్ వేసి ప్రారంభించాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ ఇచ్చాడు. అనంతరం తరవాతి బంతుల్లో కుశాల్ (0), నిస్సాంక (0) ను వెంట వెంటనే అవుట్ చేసి లంకను కోలుకోకుండా చేశాడు. ఇటు దశలో మూడు పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన టీమిండియా.. తీక్షణ వేసిన తొలి బంతిని కెప్టెన్ సూర్య బుల్లెట్ లాంటి షాట్ కొట్టి బౌండరీకి తరలించాడు. దీంతో భారత్ సూపర్ విజయాన్ని అందుకుంది.

ఇక అంతకుముందు 138 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు నిస్సాంక, కుశాల్ మెండిస్ తొలి వికెట్ కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బ్యాటర్లు ఇబ్బందిపడినచోట శ్రీలంక ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడారు. నిస్సాంకను రవి బిష్ణోయ్ ఔట్ చేసినప్పటికీ.. కుశాల్ ఫెరీరా తో కలిసి కుషాల్ మెండిస్ శ్రీలంక ఇన్నింగ్స్ ను ధైర్యంగా ముందుకు నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు ఏకంగా 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం కుషాల్ ను రవి ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన హసరంగ, అసలంక ను సుందర్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు.

ఇదే దశలో 19 ఓవర్ రింకూ సింగ్ కు సూర్య ఇచ్చాడు.. అయితే ఈ ఓవర్ లో రింకు సింగ్ అనూహ్య ఫలితాన్ని భారత్ కు అందించాడు..కుషాల్ ను రింకూ సింగ్ రిటర్న్ క్యాచ్ ద్వారా అవుట్ చేశాడు. ఇక ఇదే ఓవర్ చివరి బంతికి రమేష్ మెండిస్ ను కూడా పెవిలియన్ పంపించాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠ గా మారింది. చివరి గువర్లో శ్రీలంక విజయానికి ఆరు పరుగులు కావాల్సిన సమయంలో సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ వేశాడు.

తొలి బంతిని డాట్ గా స్పందించాడు. ఆ తర్వాత బంతుల్లో వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. కామిందు మెండిస్, తీక్షణ ను వెంట వెంటనే అవుట్ చేశాడు. నాలుగో బంతికి అసిత సింగిల్ తీశాడు. విక్రమసింగే చివరి రెండు బంతుల్లో క్విక్ డబుల్స్ తీసి మ్యాచ్ ను టై గా చేశాడు. అయితే వాస్తవానికి క్విక్ డబుల్స్ తీసే సమయంలో శ్రీలంక ఆటగాళ్లను రన్ అవుట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ భారత ఫీల్డర్లు చేజార్చుకున్నారు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది.

సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ తన ప్రతాపం చూపించడంతో శ్రీలంక జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. వాస్తవానికి సూపర్ ఓవర్ వాషింగ్టన్ సుందర్ కు ఇవ్వడం ఆశ్చర్యపరచింది. అయితే అతడు తనపై కెప్టెన్ పెట్టుకుని నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయలేదు. అద్భుతమైన బౌలింగ్ వేసి సత్తా చాటాడు. ఫలితంగా భారత్ విక్టరీ అందుకొని సిరీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.