https://oktelugu.com/

India Vs Sri Lanka 2024 T20: వర్షం ఇబ్బంది పెట్టినప్పటికీ.. గంభీర్, సూర్య జోడి తొలి సిరీస్ పట్టేసింది.

భారత ఇన్నింగ్స్ ప్రారంభం కాగానే వర్షం కురిసింది. ఆటకు దాదాపుగా గంటసేపు అంతరాయం కలిగింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండడంతో డక్ వర్త్ లూయిస్ విధానం అనివార్యమైంది. ఫలితంగా భారత లక్ష్యాన్ని అంపైర్లు 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 29, 2024 / 08:22 AM IST

    India Vs Sri Lanka 2024 T20

    Follow us on

    India Vs Sri Lanka 2024 T20: టి20 వరల్డ్ కప్ గెలిచింది. జింబాబ్వేతో సిరీస్ దక్కించుకుంది. ఇదే ఉత్సాహంలో టీమిండియా సరికొత్తగా ముస్తాబయింది. కొత్త కోచ్, కొత్త కెప్టెన్ కలయికతో శ్రీలంక పర్యటనకు వెళ్ళింది. మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ ను 2-0 తేడాతో దక్కించుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రీలంకను మట్టికరిపించి ట్రోఫీ అందుకుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో భారత మహిళల జట్టును శ్రీలంక ఓడిస్తే.. పురుషుల జట్టును సూర్య సేన బోల్తా కొట్టించి ప్రతీకారం తీర్చుకుంది. మొదటి టి20 మ్యాచ్లో 43 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. రెండో టి20 మ్యాచ్లో వర్షం ఇబ్బంది పెట్టినప్పటికీ 7 వికెట్ల తేడాతో అద్భుతమైన గెలుపును దక్కించుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 151 రన్స్ చేసింది. కుశాల్ 53 రన్స్ చేసి లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు. భారత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ (3/26) మూడు వికెట్లు పడగొట్టాడు.. అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరంతా శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేయడంలో తన వంతు పాత్ర పోషించారు.

    వర్షం మొదలైంది

    భారత ఇన్నింగ్స్ ప్రారంభం కాగానే వర్షం కురిసింది. ఆటకు దాదాపుగా గంటసేపు అంతరాయం కలిగింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండడంతో డక్ వర్త్ లూయిస్ విధానం అనివార్యమైంది. ఫలితంగా భారత లక్ష్యాన్ని అంపైర్లు 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. దీంతో భారత జట్టు ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వచ్చారు. యశస్వి 15 బంతుల్లో 30 పరుగులు చేసి పెను విధ్వంసాన్ని సృష్టించాడు. సూర్య కుమార్ యాదవ్ తుఫాన్ వేగంతో 12 బంతుల్లో 26 పరుగులు చేసి భారత జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. హార్దిక్ పాండ్యా తొమ్మిది బంతుల్లో 22* చెలరేగడంతో భారత జట్టు 6.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో గిల్ కు బదులుగా సంజు శాంసన్ కు అవకాశం ఇచ్చినప్పటికీ అతడు పూర్తిస్థాయిలోకి వినియోగించుకోలేకపోయాడు. కేవలం 0 పరుగులకే ఆవుటయి.. పూర్తిగా నిరాశపరిచాడు. అయితే ఈ సిరీస్లో చివరిదైనా మూడవ మ్యాచ్ మంగళవారం జరుగుతుంది.

    వాస్తవానికి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకోవడం పట్ల సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు వచ్చాయి. అయితే తొలి టి20 మ్యాచ్లో ఇదే మైదానంపై భారత జట్టు 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కానీ మరుసటిరోజే మైదానం పూర్తిగా మారిపోయింది. అందువల్లే సూర్య కుమార్ యాదవ్ టాస్ గెలవగానే మరో మాటకు తావులేకుండా బౌలింగ్ వైపు మొగ్గు చూపాడు. అతని నిర్ణయం సరైనదేనని బౌలర్లు నిరూపించారు. ముఖ్యంగా రవి బిష్ణోయ్ పదునైన బంతులు వేస్తూ శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. శ్రీలంక ఆటగాళ్లలో కుషాల్ పెరీరా మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. అందువల్లే శ్రీలంక భారీ స్కోర్ చేయలేకపోయింది..

    ఇక ఈ సిరీస్ కు సూర్య కుమార్ యాదవ్ ను ఏరి కోరి కెప్టెన్ గా నియమించిన గౌతమ్ గంభీర్.. అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు. సూర్య కుమార్ యాదవ్ రెండు టీ20 మ్యాచ్లలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. తనను మిస్టర్ 360 అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు. కీలక సమయాల్లో బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించడం ద్వారా ఫలితాన్ని రాబట్టాడు. ఇదే విధానాన్ని గౌతమ్ గంభీర్ కూడా ఐపీఎల్ లో పాటించాడు. 2012, 2014 సీజన్లలో కోల్ కతా ఐపీఎల్ కప్ లు దక్కించుకుంది. గంభీర్ సూచనలను తూచా తప్పకుండా పాటించి సూర్య కుమార్ యాదవ్ విజయవంతమయ్యాడు. అందువల్లే భారత్ రెండు మ్యాచ్లలోనూ శ్రీలంకపై పై చేయి సాధించింది. ఇక రెండో టి20 మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టిన రవి బిష్ణోయ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు.