India Vs Pakistan: ఉత్కంఠ అంటే ఇదే. టెన్షన్ అంటే ఇదే.. నరాలు తెగే ఆందోళన అంటే కూడా ఇదే. బంతికి బంతికి విజయ సమీకరణం మారిపోతోంది. వికెట్ పడినప్పుడల్లా భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుంటే.. ఫోర్ లేదా సిక్స్ కొట్టినప్పుడల్లా పాక్ ఆటగాళ్లు వేడుకలు చేసుకున్నారు. కానీ అంతిమంగా భారత జట్టే గల్లా ఎగిరేసి నిలబడింది. భారత అభిమాన గణమే సగర్వంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించింది. న్యూయార్క్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో (భారత కాలమానం ప్రకారం) భారత్, పాకిస్తాన్ తలపడగా.. ఉత్కంఠ మధ్య రోహిత్ సేన ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు దక్కించుకున్నాడు.. అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 119 పరుగులకే ఆల్ అవుట్ అయింది.. రోహిత్ శర్మ 13, విరాట్ కోహ్లీ 4 పూర్తిగా నిరాశపరిచారు. ఈ దశలో పంత్ 42, అక్షర్ పటేల్ 20 పరుగులు చేయడంతో భారత్ ఆ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది. శివం దుబే, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా.. ఇలా కీలక ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరచడంతో భారత్ చెప్పుకోదగ్గ స్థాయిలో స్కోర్ చేయలేకపోయింది.. పాకిస్తాన్ బౌలర్లలో నసీం షా, రౌఫ్ చెరి మూడు, మహమ్మద్ అమీర్ రెండు వికెట్లు పడగొట్టారు.
119 పరుగులే చేసినప్పటికీ, ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు చివరిదాకా పోరాడారు.. బుమ్రా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, సిరాజ్ వంటి వారు మెరుగ్గా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ గెలుపు ముంగిట బోల్తా పడింది. భారత్ విధించిన 119 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో.. పాకిస్తాన్ దూకుడుగానే బ్యాటింగ్ చేసింది. ఒకానొక దశలో పది ఓవర్లకు ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 57 పరుగులు చేసిన పాకిస్తాన్.. డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఒక్కసారిగా తడబడింది. అక్షర్ పటేల్ ఉస్మాన్ ఖాన్ ను అవుట్ చేయడం ద్వారా పాకిస్తాన్ పతనం మొదలైంది..ఫకర్ జమాన్ దూకుడుగా ఆడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఓ సందర్భంలో భారత్ విజయావకాశాలు ఎనిమిది శాతానికి పడిపోయాయి. కానీ భారత బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. వరుసగా వికెట్లు పడగొట్టి.. సింగిల్స్ కూడా ఇవ్వకుండా.. పాకిస్తాన్ ఆటగాళ్ళను పెవిలియన్ పంపించారు.