Amaravati Capital : అమరావతికి కొత్త కళ వస్తోంది. తెలుగుదేశం ఘనవిజయం సాధించడం, అమరావతి రూపశిల్పి చంద్రబాబు సీఎం కానుండడంతో ఊపిరి పీల్చుకుంది. ఇన్ని రోజులపాటు నిర్లక్ష్యానికి గురైన అమరావతిలో సీఆర్డీఏ ఆగమేఘాలపై పనులు ప్రారంభించింది. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 25 ప్రాంతాల్లో 94 ప్రోక్లైనర్లతో పనులు చేపడుతున్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ పనులతో అమరావతి సరికొత్త రూపంలో దర్శనమిస్తోంది. 673 ఎకరాల విస్తీర్ణంలో ముళ్ళ కంపలను తొలగిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయను ఉండడంతో.. అప్పటిలోగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. రేయింబవళ్లు పనులు జరుగుతున్నాయి.
2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిరాజధాని నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేసింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అప్పటివరకు చేపట్టిన నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేసింది. దీంతో అమరావతి ప్రాంతం పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలతో అడవిని తలపిస్తోంది. ఇప్పుడు టిడిపి అధికారంలోకి రావడంతో అమరావతి పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. అప్పట్లో నిలిపివేసిన నిర్మాణాల పటిష్టత ఏ స్థాయిలో ఉందో తేల్చేందుకు ఇంజనీరింగ్ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారం నాటికి అమరావతి రాజధాని విద్యుత్ దీపాలతో కళకళలాడనుంది. కరకట్టలపై వెలగని విద్యుత్ దీపాలను సిఆర్డిఏ సిబ్బంది మార్చుతున్నారు. కరకట్ట రోడ్డుపై వెలగని 32 దీపాలను, మిగిలిన రోడ్లపై మరో 55 లైట్లు మార్చారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపై రెండు దశల్లో రూ.9.50 కోట్లతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టును కూడా తాజాగా పూర్తి చేశారు. వెంకటపాలెం నుంచి రాయపూడి వరకు 9 కిలోమీటర్ల మేర వీధి దీపాలను ఏర్పాటు చేశారు. కరకట్ట రోడ్డు, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ అధికారుల వర్కర్స్ కి వెళ్లేందుకు మార్గాలు లేవు. ముళ్లపదలతో అవి నిండిపోయాయి. వాటిని సైతం తొలగిస్తున్నారు. 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాటికి అమరావతి రాజధానిని సరికొత్త రూపంలో చూపించనున్నారు.