IND W Vs SL W: ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ టీమిండియాను ఒక అంశం మాత్రం తీవ్రస్థాయిలో కలవర పాటుకు గురిచేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం జరిగే రెండవ టి20 మ్యాచ్లో ఆ తప్పు మరోసారి పునరావృతం కాకూడదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఐదు మ్యాచ్ల సిరీస్లో విశాఖపట్నంలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పర్యటక శ్రీలంక జట్టును 121/6 వరకే కట్టడి చేసిన భారత మహిళల జట్టు.. ఫీల్డింగ్ విషయంలో మాత్రం దారుణమైన ప్రదర్శన చేసింది. ముఖ్యంగా క్యాచింగ్ విషయంలో ప్లేయర్లు చెత్త ప్రదర్శన చేశారు. ఏకంగా ఐదు క్యాచ్ లను విడిచిపెట్టారంటే టీ మీడియా ఫీల్డింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ” అది అత్యంత దారుణమైన ప్రదర్శన. ఐదు క్యాచ్ లు వదిలిపెట్టమనేది ఇబ్బందికరమైన పరిణామం. దీనిపై పునరాలోచన చేస్తున్నాం. మరొకసారి ఇటువంటి తప్పు చేయకుండా చూస్తామని” కెప్టెన్ హర్మన్ ప్రీత్ వ్యాఖ్యానించిందంటే టీమ్ ఇండియా ఫీలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫీల్డింగ్ విషయంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ.. మంగళవారం విశాఖపట్నం వేదికగా జరిగే మ్యాచ్ లో టీమిండియా ఫేవరెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. తొలి మ్యాచ్లో జమీమా తన సూపర్ ఫామ్ కొనసాగించింది.. ఓపెనర్ సఫాలి వర్మ తన స్థాయికి తగ్గట్టుగా ఆడాల్సి ఉంది . స్మృతి మందాన స్థిరమైన ఆట తీరు కొనసాగిస్తే జట్టుకు ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నారు. రెండో మ్యాచ్లో కూడా వీరు ఇదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తే టీమిండియా కు తిరిగి ఉండదు. ఇక 20 సంవత్సరాల ఎడమ చేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మ అద్భుతంగా బౌలింగ్ వేస్తోంది. వికెట్లు తీయకపోయినప్పటికీ ఆమె 16 పరుగులు ఇవ్వడం విశేషం. పేస్ బౌలింగ్ బాధ్యతను అరుంధతి రెడ్డి, అమన్ మోస్తున్నారు. దీప్తి శర్మ, శ్రీ చరణి స్పిన్ బాధ్యతలను మోస్తున్నారు. కాగా, లంక జట్టుతో జరిగిన గత పది t20 మ్యాచ్ లలో భారత్ ఏకంగా 8 గెలవడం విశేషం.