Eng Vs Aus Ashes 2025: వన్డేలో వేగంగా బ్యాటింగ్ చేయొచ్చు. టి20లో బీభత్సంగా పరుగులు చేయొచ్చు. టెస్ట్ లో మాత్రం అసలు సిసలైన క్రికెట్ ఆడొచ్చు. టెస్ట్ క్రికెట్ ద్వారా ఒక ఆటగాడిలో ఉన్న అసలైన సమయమనం, స్థిరత్వం బయటపడతాయి. లెజెండ్ క్రికెటర్లు మొత్తం టెస్ట్ ఫార్మేట్ లో సత్తా చూపించినవారే. టెస్టుల్లో అద్భుతంగా ఆడటం ద్వారా.. వారు మిగతా ఫార్మేట్ లలో అదరగొట్టారు. టెస్ట్ ఫార్మేట్ కు వేగవంతమైన ఆటను పరిచయం చేసిన ఇంగ్లాండ్ జట్టు.. దానికి బజ్ బాల్ అని పేరు పెట్టింది. మొదట్లో ఈ విధానం ఆ జట్టుకు మెరుగైన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత అసలుకే ఎసరు పెట్టింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డమీద కంగారు జట్టుతో జరుగుతున్న యాషెస్ సిరీస్ లో మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే.. ఇంగ్లాండ్ జట్టు సిరీస్ కోల్పోయింది. వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయింది. దీంతో బజ్ బాల్ ను ఇంగ్లాండ్ జట్టు కాలగర్భంలో కలిపినట్టేనని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
2022లో బ్రెండన్ మెక్ కలమ్ ఇంగ్లాండ్ జట్టుకు శిక్షకుడిగా నియమితులయ్యాడు. నాటి కెప్టెన్ బెన్ స్టోక్స్ తో కలసి బజ్ బాల్ విధానానికి శ్రీకారం చుట్టాడు. బజ్ అనేది మెక్ కలమ్ ముద్దు పేరు. ఈ విధానంలో పరుగులు ఇవ్వడం కంటే వికెట్లు తీయడం.. డ్రా చేసుకోవడం కంటే విజయం కోసం మాత్రమే అడటం.. అత్యంత సాహసమైన నిర్ణయాలు తీసుకోవడం.. సరికొత్త విధానంలో టెస్టులు ఆడటం.. సరిగ్గా ఇలా ఆడుతూనే వరుసగా నాలుగు మ్యాచ్లలో 250 పైచిలుకు లక్ష్యాలను ఇంగ్లాండ్ జట్టు చేవించింది. ముఖ్యంగా 2022లో భారత జట్టు నిర్దేశించిన 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఫినిష్ చేసింది. ఆ గెలుపు ఇంగ్లాండ్ జట్టుకు టెస్టు సిరీస్ ఓటమి నుంచి తప్పించింది. అయితే ఈ విధానంలో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఆ ఆటను మర్చిపోలేదు.
గత ఏడాది పాకిస్తాన్లో పర్యటిస్తున్నప్పుడు ఇంగ్లాండ్ జట్టు టెస్టు సిరీస్ ఓడిపోయింది. మొదటి టెస్ట్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు.. తదుపరి రెండు టెస్టులను వరుసగా ఓడిపోయింది. ఆ తర్వాత భారత్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ 2-2 సమం కావడంతో.. మరింత విమర్శల పాలైంది. ముఖ్యంగా చివరి టెస్టులో 374 రన్స్ టార్గెట్ తో ఇంగ్లాండ్ రంగంలోకి దిగింది. ఒకానొక దశలో ఐదు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. అయితే 35 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో బజ్ బాల్ విధానంపై మరోసారి విమర్శలు వచ్చాయి.
ప్రస్తుత యాషెస్ లో తొలి టెస్ట్ ను ఇంగ్లాండ్ జట్టు మెరుగ్గానే మొదలుపెట్టింది. మూడు ఇన్నింగ్స్ లలో అప్పర్ హ్యాండ్ కొనసాగించింది. కానీ హెడ్ దూకుడు కొనసాగించడంతో ఇంగ్లాండు పరిస్థితి మారిపోయింది. ప్రస్తుత సిరీస్లో ఆస్ట్రేలియా జట్టులో హెజెల్ వుడ్ లేడు. తొలి రెండు మ్యాచ్లకు కమిన్స్ దూరమయ్యాడు. మూడో మ్యాచ్ లో స్మిత్ ఆడలేదు. ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ ఉపయోగించుకోలేకపోయింది. అన్నట్టు ఈ సిరీస్ తర్వాత స్టోక్స్, మెక్ కలమ్ స్థానాలు ప్రభావితమవుతాయని ఇంగ్లాండ్ మీడియా చెబుతోంది.