IND-W vs AUS-W ICC Women’s World Cup: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు ప్రారంభమై పది రోజులు కావొస్తున్నా మ్యాచ్‌లు అన్నీ చప్పగా సాగుతున్నాయి. భారత్–పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే కాస్త ఆసక్తికరంగా సాగింది. కానీ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్టణంలో గురువారం జరిగిన మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేశారు. చివరి వరకూ క్రీడాభిమానులు ఉత్కంఠ భరితంగా మ్యాచ్‌ను తిలకించారు. విశాఖ స్టేడియంలో మౌలిక సదుపాయాలు ఉన్నా.. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న తగిన గుర్తింపు రావడం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్ మౌలిక వసతులు, అభివృద్ధిపై ప్రత్యే దృష్టిపెట్టారు. బీసీసీఐ, ఐసీసీ అధ్యక్షుడు జైషాతో వ్యక్తిగతంగా చర్చించి క్రికెట్ మ్యాచ్‌లు పెంచేలా కృషి చేశారు.
ఐపీఎల్ నుంచి అంతర్జాతీయ స్థాయికి..
మొదట విశాఖ స్టేడియంలో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ల నిర్వహణతో ప్రారంభమైంది. ఇప్పుడు అంతర్జాతీయ పోటీలకు విస్తరించింది. ఈ పరిణామం, స్టేడియం క్రీడాభివృద్ధి కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నదనే సంకేతాన్ని ఇస్తోంది. ఇప్పటి వరకు పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. తాజాగా మహిళల వరల్డ్ కప్ మ్యాచ్‌కు విశాఖ మైదానం వేదికైంది.
ఉత్కంఠ భరితంగా భారత్–సౌత్ ఆఫ్రికా మ్యాచ్..
తాజాగా జరిగిన మహిళల ప్రపంచకప్‌లో భారత్ – దక్షిణాఫ్రికా జట్ల పోరు, టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌గా నిలిచింది. చివరి వరకు సాగిన ఈ పోరులో భారత్ పరాజయం పొందినప్పటికీ, ప్రేక్షకులకు అందించిన థ్రిల్ విలువ మరువలేనిది. ఈ పోరు, విశాఖ స్టేడియం సామర్థ్యం ఎంత ఉందో మరోసారి రుజువు చేసింది. ఉన్నత స్థాయి పిచ్ పరిస్థుతులు, సక్రమ నిర్వహణతో గ్లోబల్ గుర్తింపు పొందే క్రికెట్ కేంద్రంగా మారే అవకాశం ఉంది.
సరైన ప్రణాళిక, నిరంతర అభివృద్ధి ద్వారా విశాఖ స్టేడియం, జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌లో కీలకంగా నిలవవచ్చు. ఇది నగరానికి క్రీడాపరమైన గౌరవాన్ని మాత్రమే కాకుండా, ప్రపంచపటంలో ప్రత్యేక స్థానాన్ని కూడా కల్పిస్తుంది.