Puri Jagannath Rathna Bhandagar : నిత్య కళ్యాణం.. పచ్చ తోరణం.. వెలకట్టలేని సంపద.. ఈ ప్రస్తావన వస్తే చాలు మన మదిలో తిరుపతి మెదులుతుంది. అయితే పూరి జగన్నాథుడి ఆలయం కూడా తిరుపతి కంటే తక్కువేమీ కాదు. పూరి జగన్నాథుడికి నిత్య కైంకర్యాలు విశేషంగా జరుగుతాయి. ఇక మూలికా పూజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడతలవారీగా అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహిస్తుంటారు. మిగతా ఆలయాలతో పోల్చితే పూరి జగన్నాథ స్వామికి విభిన్నంగా పూజలు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది జూలై మాసంలో నిర్వహించే రథయాత్ర కన్నుల పండువగా సాగుతుంది. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. ఆ రోజుల్లో పూరి నగరం జన సముద్రాన్ని తలపిస్తుంది. ఇసుక వేస్తే కూడా రాలనంత జన సందోహం ఏర్పడుతుంది. ప్రతి ఏడాది జూలై నెలలో రథయాత్ర ద్వారా వార్తల్లో నిలిచే పూరి క్షేత్రం.. ఈసారి ఆభరణాలు లెక్కింపుతో మరింత ప్రాచుర్యాన్ని పొందింది.
1978లో లెక్కించారు..
కోర్టు ఆదేశాల మేరకు పూరి జగన్నాథ స్వామి ఆలయానికి సంబంధించిన ఆభరణాలను లెక్కించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. రత్న భాండాగారం తలుపులను ఆదివారం మధ్యాహ్నం తెరిచారు. అప్పట్లో స్వామివారి ఆభరణాలను ఐదు పెట్టెల్లో భద్రపరిచారు. వాటిని ఒక రహస్య గదిలో ఉంచారు. గతంలో పూరి జగన్నాథుడి ఆలయ ఆభరణాలను భద్రపరచిన రహస్య గది తలుపులను మూడు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి తెరిచి లెక్కించేవారు. చివరిసారిగా 1978లో స్వామివారి ఆభరణాలను లెక్కించారు. ఆ సమయంలో 70 రోజులపాటు ఆభరణాలను లెక్కించారు. అప్పటికే సమయం మించి పోవడం.. సరిపడినంత సిబ్బంది లేకపోవడంతో కొన్ని ఆభరణాలను లెక్కించకుండా వదిలేశారు. దానిపై అప్పట్లో పెద్దపెట్టున సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఒడిశా హైకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైంది. దానిపై న్యాయస్థానం విచారణ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాండాగారం తెరిచి సంపద మొత్తం లెక్కించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో.. సర్వోన్నత న్యాయస్థానం కూడా భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది..”రహస్య గదులు శిథిలావస్థకు చేరాయి. వర్షపు నీరు ఆ గదుల లోపలికి వెళుతోంది. గది లోపల విష సర్పాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. అలాంటప్పుడు ఆ గదులకు మరమ్మతులు జరపాలని” 2018లో ఒడిస్సా హైకోర్టు పురావస్తు శాఖను ఆదేశించింది.
గది తాళపు చెవి కనిపించలేదు
హైకోర్టు ఆదేశాల మేరకు 2019 ఏప్రిల్ 6న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 13 మందితో అధ్యయన సంఘం పేరుతో ఓ కమిటీని నియమించారు. వారు రహస్యపు గది తాళాన్ని తెరిచేందుకు తాళపు చెవి కోసం వెతికారు. అయితే అది కనిపించకపోవడంతో వారు వెనక్కి వచ్చేశారు. అయితే రహస్యపు గది మరమ్మతుల కోసం తీసుకునే చర్యలకు సంబంధించి ఒడిశా ప్రభుత్వం జస్టిస్ రఘు వీర్ దాస్ ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. ఆ సమయంలో మరొక తాళపు చెవి(డూప్లికేట్) పూరి కలెక్టరేట్ ఖజానా కార్యాలయంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈలోగా రఘు వీర్ కమిటీ రూపొందించిన నివేదికను ఒడిశా ప్రభుత్వం బయట పెట్టలేదు.
బిజెపి ప్రచార అస్త్రంగా వాడుకుంది
ఇటీవల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పూరి జగన్నాథ స్వామి రహస్యపు గది సంపద లెక్కింపు అంశాన్ని ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంది. “పూరి జగన్నాథుడి ఆలయ ఖజానాలో ఆభరణాలున్నాయి. వాటి లెక్కింపు సంబంధించి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది. గతంలో నియమించిన కమిటీ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదు. చూస్తుంటే ఏదో జరిగి ఉందనే అనుమానం కలుగుతోంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా పారదర్శకంగా చేస్తాం. పూరి జగన్నాథుడి ప్రాశస్త్యం మరింత పెంచుతామని” బిజెపి నాయకులు ఎన్నికల ప్రచార సమయంలో ఒడిశా ప్రజలకు హామీలు ఇచ్చారు. అంచనా వేసినట్టుగానే ఒడిశాలో బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని బిజెపి నాయకులు అమలు చేశారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో ఒక కమిటీని బిజెపి ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు రత్న భాండాగారం తెరిచేందుకు ఒడిశా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఆ రత్న భాండాగారం ఎలా ఉంది? లోపల ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అనే ప్రశ్నలకు అటు కమిటీ వద్ద గాని, ఇటు ప్రభుత్వం వద్ద గాని సమాధానాలు లేవు. 46 సంవత్సరాలుగా ఆ రత్న భాండాగారం లోపలికి ఎవరూ వెళ్లలేదు.. రత్న భాండాగారంలో సర్పాలు ఎక్కడివి? ఆ సర్పాలు అందులోకి ఎందుకు వెళ్లాయి? అనే ప్రశ్నలకు స్థానికులు అది పూరి జగన్నాథుడి లీల అని చెబుతున్నారు.