IND Vs WI Test Team Announcement: టీమిండియాలో ప్రస్తుతం విపరీతమైన పోటీ ఉంది. ఒక్కో స్థానం కోసం చాలామంది క్రికెటర్లు పోటీ పడుతున్నారు. ఇందులో సీనియర్ క్రికెటర్లను లెక్కిస్తే ఈ పోటీ అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జట్టులో చోటు లభించిన వారు.. వచ్చిన అవకాశాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే టీమ్ ఇండియాలో ఓ ఆటగాడు మాత్రం వచ్చిన అవకాశాన్ని అంతగా సద్వినియోగం చేసుకోకపోవడంతో అతని ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారింది.
ఇటీవల టీమిండియా ఇంగ్లాండ్ సిరీస్ ఆడింది. ఇందులో కరుణ్ నాయర్ కు అవకాశం లభించింది. ఎంతోమంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ అతని మీద నమ్మకం ఉంచింది. అవకాశాలు కూడా ఇచ్చింది. కానీ అతడు వినియోగించుకోలేకపోయాడు. జట్టుకు అవసరమైన సందర్భంలో గట్టి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. గొప్పగా పరుగులు చేయలేకపోయాడు. మేనేజ్మెంట్ పట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయడంతో స్వదేశంలో వెస్టిండీస్ జట్టుతో జరిగే సిరీస్ కు నాయర్ కు అవకాశం ఇవ్వలేదు.
నాయర్ కు అవకాశం ఇవ్వకపోవడం పట్ల చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించారు.. ” ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్ లో అతడు మెరుగైన ప్రదర్శన చేయలేదు. అతడు ఉత్తమమైన ప్రదర్శన చేస్తాడని ఊహించాం. కానీ అది సాధ్యం కాలేదు. అందువల్లే అతడికి దేవదత్ పడికల్ కు అవకాశం కల్పించాం. ఇండియా ఏ జట్టు తరఫున తను బాగా ఆడుతున్నాడు. ఇకపై ప్రతి ఒక్కరికి 15 నుంచి 20 టెస్ట్ లు అవకాశం ఇస్తాం. వాటిని సద్వినియోగం చేసుకున్న దాని ప్రకారమే ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తామని” అగార్కర్ పేర్కొన్నాడు. కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్ లో నాలుగు మ్యాచ్లు ఆడాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తం 205 పరుగులు చేశాడు.
ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు తరఫున ఆడిన నాయర్ అద్భుతమైన ఫామ్ కొనసాగించాడు. బీభత్సంగా పరుగులు తీశాడు. కానీ ఎందుకనో అదే ఫామ్ ఇంగ్లాండ్ సిరీస్ లో కంటిన్యూ చేయలేకపోయాడు. దీంతో వెస్టిండీస్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కు అతడిని ఎంపిక చేయలేదు. డొమెస్టిక్ క్రికెట్లో కరుణ్ ప్రతిభ చూపితేనే తదుపరి సిరీస్లలో అవకాశాలు లభిస్తాయి.