IND Vs SL: అది పల్లెకెలె మైదానం.. శ్రీలంక ప్రత్యర్థి జట్టు.. భారత్ బౌలింగ్ చేస్తోంది.. బంతి రవి బిష్ణోయ్ చేతిలో ఉంది. స్ట్రైకర్ గా కమిందు మెండీస్ ఉన్నాడు. రవి బిష్ణోయ్ బంతి వేయగా.. కమిందు భారీ షాట్ కొట్టబోయాడు. అయితే ఆ బంతి బ్యాట్ చివరి అంచుకు తగిలి ఔట్ ఫీల్డ్ లో తక్కువ ఎత్తులో ఎగిసింది. ఆ బంతిని పట్టుకునేందుకు రవి బిష్ణోయ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఇదే సమయంలో ఆ బంతి చివరి అంచు అతని కంటికి కింది భాగంలో తగిలింది. అంతే రక్తం ధారగా వచ్చింది. ఆ రక్తం అతడి ముఖాన్ని తడిపింది. అయినప్పటికీ అతడు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళలేదు. ప్రధమ చికిత్స చేయించుకొని.. గాయానికి ప్లాస్టర్ అంటించుకుని అలానే మ్యాచ్ ఆడాడు.. చివరికి కమిందు ను ఔట్ చేశాడు. క్రికెట్ పై తనకు ఉన్న మక్కువను చాటుకున్నాడు.. ఓ వైపు గాయం ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు.
ఇక రెండో టీ20 మ్యాచ్ లోనూ రవి బిష్ణోయ్ అదరగొట్టాడు.. వాస్తవానికి మొదటి మ్యాచ్లో ఓడిపోయిన శ్రీలంక.. రెండవ టి20 మ్యాచ్లో ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించింది. శ్రీలంక ఓపెనర్ నిశాంక 32 పరుగులు చేసి మెరుగైన ఆరంభాన్ని అందించాడు. కుషాల్ పది పరుగులు మాత్రమే చేసి అవుట్ అయినప్పటికీ.. నిశాంక, కుశాల్ ఫెరీరా జోడి దూకుడుగా ఆడింది. వీరిద్దరూ తొమ్మిది ఓవర్లకు శ్రీలంక స్కోర్ 77 పరుగులకు చేర్చారు. దీంతో మ్యాచ్ చూస్తున్న వారంతా శ్రీలంక భారీ స్కోర్ చేస్తుందని భావించారు. కానీ ఈ దశలో సూర్య కుమార్ యాదవ్ రవి బిష్ణోయ్ ని రంగంలోకి దించాడు. ఎప్పుడైతే రవి చేతుల్లోకి బంతి వెళ్ళిందో అప్పటినుంచి మ్యాచ్ భారత్ వైపు టర్న్ అయింది. శ్రీలంక బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టించిన రవి బిష్ణోయ్.. నిశాంకను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లంక వేగానికి స్పీడ్ బ్రేకులు వేశాడు. ఆ తర్వాత కమిందు సహకారంతో ఫెరీరా లంక ఇన్నింగ్స్ ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 15 ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి లంక 130 పరుగులు చేసింది. చేతిలో ఏడు వికెట్లు ఉండడంతో 190 రన్స్ ఈజీగా చేస్తుందని అనిపించింది. దాని హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్ లో వీళ్ళిద్దరినీ అవుట్ చేసి లంకకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు.
ఆ తర్వాత బంతి అందుకున్న రవి బిష్ణోయ్ మరింత రెచ్చిపోయాడు. శనక(0), హసరంగ (0)ను పెవిలియన్ పంపించాడు. అద్భుతమైన బంతులు వేస్తూ లంక కష్టాలను మరింత పెంచాడు.. దీంతో భారీ స్కోరు సాధిస్తుందనుకున్న శ్రీలంక తొమ్మిది వికెట్లు కోల్పోయి 161 రన్స్ చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని (డక్ వర్త్ లూయిస్) భారత్ 6.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. 26 పరుగులకు మూడు వికెట్లు తీసిన రవి బిష్ణోయ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన రవి బిష్ణోయ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ” నువ్వు ఇదే స్థాయిలో బౌలింగ్ చేయి. భారత జట్టులో నీ స్థానం సుస్థిరంగా ఉంటుంది. నీ వైవిధ్యమైన బౌలింగ్ ఆకట్టుకుంటున్నది. ప్రత్యర్థి బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ లలో ఇదే నిరూపితమైంది. నీ ఫామ్ ఇలానే కొనసాగించు. అప్పుడు కచ్చితంగా టీమిండియా అభిమానులు నీకు గుడి కట్టేస్తారు అంటూ” సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే శ్రీలంకలో జరిగిన తొలి మ్యాచ్లో గాయపడిన రవి బిష్ణోయ్, రెండో మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు. గత రెండు రోజులుగా అతడు సోషల్ మీడియాలో మోస్ట్ సెర్చింగ్ పర్సన్ గా నిలిచాడు.