IND vs SA: మొండి ఎద్దు బెదిరిస్తే కదలదు.. కర్రతో కొట్టినా చలించదు. ఇప్పుడు టీమ్ ఇండియా పరిస్థితి కూడా అలానే ఉంది. దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్లో టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శన చేస్తోంది. తొలి టెస్ట్ లో దారుణంగా ఓడిపోయిన టీమ్ ఇండియా.. రెండో టెస్టులో కూడా దాదాపు ఓటమికి దగ్గర్లో ఉంది.. మహా అయితే అంతర మాత్రమే తగ్గొచ్చు.
గుహవాటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టుల్లో దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 489 పరుగులు చేసింది.. ముత్తుస్వామి(109), యాన్సన్(93) పరుగులు చేశారు.. కులదీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.. జడేజా, బుమ్రా, సిరాజ్ తల రెండు వికెట్లు సాధించారు. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 201 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. యశస్వి జైస్వాల్(58) టాప్ స్కోరర్ గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 48 పరుగులు చేశాడు.. యాన్సన్ ఆరు వికెట్లు పడగొట్టాడు. హార్మర్ మూడు వికెట్లు సాధించాడు.
ఇండియాను ఫాలో ఆన్ ఆడించకుండా దక్షిణాఫ్రికా మళ్లీ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.. స్టబ్స్(94), డోర్జీ (4 9) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు సాధించాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం ద్వారా టీమ్ ఇండియా ఎదుట దక్షిణాఫ్రికా జట్టు 549 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది.
ఈ లక్ష్యాన్ని చేదించడం దాదాపు అసాధ్యం. ఇండియా మీద పెద్దగా ఆశలు కూడా లేవు. ఇలాంటి దశలో కనీసం డ్రా కోసమైనా ఆడాల్సి ఉండాలి. కానీ టీమ్ ఇండియా ప్లేయర్లు అవుట్ అవ్వడానికి పోటీపడ్డారు.. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (13) యాన్సన్ బౌలింగ్లో నిర్లక్ష్యపు షాట్ ఆడి కీపర్ కు దొరికిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి కేఎల్ రాహుల్ (6) హార్మర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో చూస్తుండగానే ఓపెనర్లు పేవిలియన్ చేరుకున్నారు. ఈ దశలో మరో వికెట్ పోకుండా ఉండడానికి టీమిండియా నైట్ వాచ్మెన్ గా కులదీప్ యాదవ్(4) ను పంపించింది. అప్పటికే వన్ డౌన్ ఆటగాడిగా సాయి సుదర్శన్ (2) వచ్చాడు. కులదీప్, సాయి సుదర్శన్ మూడో వికెట్ కు 39 బంతుల్లో 6* పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు అంటే దక్షిణాఫ్రికా బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టీమిండియా చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. జీవం లేని పిచ్ పై కూడా బంతిని అద్భుతంగా టర్న్ చేస్తున్నారు దక్షిణాఫ్రికా బౌలర్లు. ఈ ప్రకారం చూసుకుంటే ఐదో రోజు టీమిండియా ఓటమి లాంచనమే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. టీం ఇండియా ఈ మ్యాచ్ గెలవడం దాదాపు అసాధ్యం. ఒకవేళ డ్రా అవ్వాలంటే ప్లేయర్లు రోజంతా ఆడాలి. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ చివరికి కులదీప్ యాదవ్ టీమిండియా కు ఆపద్బాంధవుడిగా మారాడు అంటే.. అతడికి, మిగతా వారికి ఉన్న తేడా ఏమిటో అర్థం చేసుకోవచ్చు.