Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు( Godavari festivals ) సంబంధించిన ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. అయితే గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం సహకారం అందిస్తోంది. ముందస్తుగానే నిధులను కేటాయించింది కేంద్రం. ఇప్పటికే 100 కోట్ల రూపాయలను పుష్కరాల కోసం ప్రకటించింది. తాజాగా రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం.. రాజమండ్రి రైల్వే స్టేషన్ కు 272 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రైళ్ల సర్వీసులను నడప నుంది. కుంభమేళా తరహాలో ఈసారి గోదావరి పుష్కరాలు ప్రత్యేకతను చాటనున్నాయి.
యాక్షన్ ప్లాన్ సిద్ధం..
అఖండ గోదావరి పుష్కరాలు- 2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ సైతం సిద్ధం అయ్యింది. అందరూ ఒకే ఘాట్ లో స్నానాలు చేసి అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లలో రోజుకు 75, 11, 616 మంది స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. 2015లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. మరోసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయనున్నారు. ఈసారి పుష్కరాల కోసం ఎనిమిది కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకే ఘాట్ల అభివృద్ధికి దాదాపు రూ.904 కోట్లతో ప్రతిపాదనలు అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉండడంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వ సహకారం..
గతంతో పోల్చుకుంటే కేంద్ర ప్రభుత్వం( central government) సైతం సంపూర్ణ సహకారం అందిస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి రైల్వే స్టేషన్ రూపురేఖలను మార్చే పనిలో పడింది కేంద్ర రైల్వే శాఖ. దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైల్వే సర్వీసులను నడప నుంది. అయితే గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రత్యేక అవకాశాన్ని దక్కించుకుంటుంది టిడిపి ప్రభుత్వం. చివరిగా 2015లో గోదావరి పుష్కరాలు జరిగాయి. అప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. 2003లో పుష్కరాలు జరిగాయి. అప్పుడు కూడా చంద్రబాబు సీఎం గా ఉన్నారు. ఇప్పుడు తాజాగా మూడోసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. ఇది ఆయనకు అరుదైన గౌరవమే. అయితే గత పుష్కరాలలో జరిగిన విషాద ఘటన పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు సీఎం చంద్రబాబు.