Ind Vs SA 4th T20: ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు బుధవారం లక్నోలో తలపడుతున్నాయి. ఏ వేదిక మీద టీం ఇండియా ఇప్పటివరకు మూడు టి20 మ్యాచ్ లు ఆడింది. మూడింటిలోనూ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నాలుగో మ్యాచ్ ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో విజయం సాధించి.. సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ టీం ఇండియా గెలిచింది.. రెండో మ్యాచ్ దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. మూడో మ్యాచ్ ను మళ్లీ టీమ్ ఇండియా దక్కించుకుంది.. ఈ ప్రకారం నాలుగో మ్యాచ్ దక్షిణాఫ్రికా సొంతమవుతుందా? లేదా టీమ్ ఇండియా గెలిచి సిరీస్ సొంతం చేసుకుంటుందా? అనే ప్రశ్నలు అభిమానుల మదిలో మెదులుతున్నాయి.
ధర్మశాల మైదానంలో జరిగిన మూడో మ్యాచ్లో పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు 117 పరుగులకు కుప్పకూలిపోయింది. ఆ మ్యాచ్లో ఆతిధ్య భారత జట్టు సులువుగా విజయం సాధించింది. ధర్మశాల మైదానం మాదిరిగానే.. లక్నో మైదానం కూడా బౌలర్లకు సహకరిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అందువల్ల ఇక్కడ టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.. ఒకవేళ సూర్య కుమార్ యాదవ్ టాస్ గెలిస్తే మరో మాటకు తావు లేకుండా బౌలింగ్ ఎంచుకుంటాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సూర్య కుమార్ యాదవ్ కొంతకాలంగా దారుణమైన ఆట తీరుతో నిరాశ పరుస్తున్నాడు. వైస్ కెప్టెన్ గిల్ కూడా అదేవిధంగా ఆడుతున్నాడు. ఈ సిరీస్లో సూర్య కుమార్ యాదవ్ ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడాడు. అతడు కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైస్ కెప్టెన్ గిల్ 3 మ్యాచులు ఆడి 32 పరుగులు చేశాడు. మూడో మ్యాచ్లో మైదానంలో గిల్ ఎక్కువసేపు ఉన్నప్పటికీ.. భారీగా పరుగులు మాత్రం చేయలేకపోయాడు. సూర్య కుమార్ యాదవ్ రెండు బౌండరీలకు మాత్రమే పరిమితం అయిపోయాడు. మరి కొద్ది రోజుల్లో స్వదేశం వేదికగా టి20 వరల్డ్ కప్ జరగబోతున్న నేపథ్యంలో.. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇలా నిరాశ పరుస్తుండడం అభిమానులకు ఏమాత్రం మింగుడు పడడం లేదు.
నాలుగో మ్యాచ్లో కూడా బుమ్రా ఆడకపోవచ్చని తెలుస్తోంది. ఎప్పటి మాదిరిగానే అర్ష దీప్ సింగ్ పేస్ దళానికి నాయకత్వం వహిస్తాడు. హర్షిత్, హార్దిక్ అతనికి సహాయం అందిస్తారు. వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలను మోస్తారు.