IND vs SA 2nd Test: అదే పిచ్.. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు దుమ్మి రేపిన చోట టీమిండియా బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఏదో అర్జెంటు పని ఉన్నట్టుగా పెవీలియన్ క్యూ కట్టారు. దీటుగా బ్యాటింగ్ చేయాల్సిన చోట.. ధాటిగా పరుగులను రాబట్టాల్సిన చోట తేలిపోయారు. కెప్టెన్ నుంచి మొదలు పెడితే నితీష్ కుమార్ రెడ్డి వరకు అందరికి విఫలమయ్యారు. మన బౌలర్లు బంతిని టర్న్ చేయడానికి ఇబ్బంది పడినచోట.. ఫ్లైట్ డెలివరీలను వేయడానికి ఆపసోపాలు పడిన చోట దక్షిణాఫ్రికా బౌలర్లు దుమ్ము రేపుతున్నారు. ఇండియా ఇజ్జత్ మొత్తం తీస్తున్నారు.
ఓవర్ నైట్ స్కోర్ 9/0 తో ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమ్ ఇండియా .. తొలి వికెట్ కు 65 పరుగులు జోడించింది. కేఎల్ రాహుల్ (22) తొలి వికెట్ గా అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ జస్వాల్ (58) హాఫ్ సెంచరీ చేశాడు. సెంచరీ వైపు వెళ్తాడు అనుకుంటున్న క్రమంలో ఊహించని విధంగా అవుట్ అయ్యాడు. అప్పటికి టీమ్ ఇండియా స్కోర్ 95 పరుగులు. ఇక అప్పటినుంచి టీం ఇండియా క్రికెట్ల పతనం వేగంగా సాగిపోయింది.
దక్షిణాఫ్రికా బ్యాటర్లు వీర విహారం చేసిన చోట.. చివరికి ఆ జట్టు బౌలర్ యాన్సన్ 90 కి పైగా పరుగులు చేసినచోట.. మన ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. కనీసం క్రీజ్ లో నిలబడే సాహసం కూడా చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడం కాదు కదా.. కనీసం బంతిని టచ్ చేయడానికి కూడా భయపడ్డారు.. ఫలితంగా టీమిండియా 30 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది..
కెప్టెన్ పంత్ (7), జురెల్(0), రవీంద్ర జడేజా (6), నితీష్ కుమార్ రెడ్డి (10), సాయి సుదర్శన్ (15) ఇలా కీలక ప్లేయర్లు మొత్తం దారుణంగా అవుట్ అయ్యారు. వాస్తవానికి ఇదే పిచ్ దక్షిణాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. చివరి వికెట్ వరకు కూడా బీభత్సమైన భాగస్వామ్యాలు నమోదు చేశారు. అలాంటిది మన ఆటగాళ్లు మాత్రం దక్షిణాఫ్రికా బౌలింగ్ మొత్తానికి దాసోహం అయిపోయారు. ఏ రోగం పుట్టిందో.. ఎంతటి బద్ధకం ఆవహించిందో తెలియడం లేదు కాని.. ఏ ఒక్క ఆటగాడు కూడా సరైన స్థాయిలో ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇప్పటికే యాన్సన్ 4, హార్మర్ రెండు వికెట్లు పడగొట్టారు.. ఈ కథనం రాసే సమయం వరకు టీమిండియా 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఇండియా ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 162 పరుగులు చేయాలి. క్రీజ్ లో వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్ ఉన్నారు. టీమిండియా ఫాలో ఆన్ తప్పించుకోవడం అంటే దాదాపు అద్భుతం జరగాల్సిందే.
WHAT A CRAZY CATCH BY AIDEN MARKRAM. pic.twitter.com/wVQNNjWsvm
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 24, 2025