Red Pitch Bowling: గుహవాటి టెస్ట్ లో కూడా దక్షిణాఫ్రికా గెలిచే విధంగా కనిపిస్తోంది.. బ్యాటింగ్లో దుమ్మురేపిన పర్యాటక జట్టు.. బౌలింగ్లో కూడా అదరగొడుతోంది. ఈ కథనం రాసే సమయం వరకు టీమిండియా 7 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.. జైస్వాల్ (58) టాప్ స్కోరర్ గా నిలిచాడు.. కేఎల్ రాహుల్ (22), కెప్టెన్ పంత్ (7), జూరెల్ (0), రవీంద్ర జడేజా (6), నితీష్ కుమార్ రెడ్డి (10), సాయి సుదర్శన్ (15) దారుణంగా విఫలమయ్యారు. ఇదే పిచ్ మీద దక్షిణాఫ్రికా బ్యాటర్లు బీభత్సంగా పరుగులు చేస్తే.. రికార్డు స్థాయి భాగస్వామ్యాలను నమోదు చేస్తే.. టీం ఇండియా ప్లేయర్లు మాత్రం చేతులెత్తేశారు. సరిగ్గా ఏడాది క్రితం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఎలాగైతే విఫలమయ్యారో.. అదే స్థాయిలో దక్షిణాఫ్రికాపై టీమిండియా ప్లేయర్లు చేతులెత్తేశారు.
ఈ పిచ్ మీద బౌలింగ్ ఎలా వేయాలో సౌత్ ఆఫ్రికా బౌలర్లను చూసి నేర్చుకోవాలని మాజీ క్రికెటర్లు టీమ్ ఇండియా ప్లేయర్లకు సూచిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఫేస్ బౌలర్ యాన్సన్ దుమ్ము రేపే రేంజ్ లో బంతులు వేస్తున్నాడు.. ప్రతి బంతి హై పేస్ బౌన్సర్ గా వేస్తున్నాడు. దీంతో ఆ బంతులను ఎదుర్కోవడం టీమ్ ఇండియా ప్లేయర్లకు ఇబ్బందికరంగా మారింది.. జూరెల్ (0), రవీంద్ర జడేజా (6), నితీష్ కుమార్ రెడ్డి (10), రిషబ్ పంత్(7) ను యాన్సన్ అవుట్ చేశాడు.. వీరందరిని కూడా ఒకే తీరైన బంతులతో యాన్సన్ ఔట్ చేయడం విశేషం.
రెడ్ పిచ్ మీద మన బౌలర్లు తేలిపోయిన చోట సౌత్ ఆఫ్రికా బౌలర్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా ఆరు ఫీట్ల ఏడు ఇంచుల ఎత్తు ఉన్న యాన్సన్ దుమ్ము రేపుతున్నాడు.. సరైన లెంగ్త్ లైన్ తో బంతులు వేస్తూ ఇండియన్ ప్లేయర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మన జట్టులో బుమ్రా అంతంతమాత్రంగా సత్తా చూపించినచోట అతడు అదరగొడుతున్నాడు. రెడ్ పిచ్ సహజంగా బంతి టర్న్ అవ్వడానికి ఉపకరించదు. కానీ బంతిని డిఫరెంట్ గా హ్యాండిల్ చేస్తే మాత్రం ఫలితం వస్తుంది. ఇదే ప్రయోగాన్ని టీమ్ ఇండియా మీద సౌత్ ఆఫ్రికా చేసింది. ఆ ప్రయోగం ఫలించడంతో టీమ్ ఇండియా చిగురుటాకులా వణుకుతోంది.
రెడ్ పిచ్ మీద టీం ఇండియా బౌలర్లు కేవలం వికెట్ లక్ష్యంగా బంతులు వేశారు. కొన్ని సందర్భాలలో ప్యాడ్లను లక్ష్యంగా చేసుకొని బంతులు వేశారు. కానీ బౌన్సర్లను వేయడంలో విఫలమయ్యారు. రెండవ రోజు లంచ్ తర్వాత బౌన్సర్లు వేసి టీమిండియా బౌలర్లు కొంతలో కొంత ఫలితాలు అందుకున్నారు. కానీ మూడవరోజు టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి దక్షిణాఫ్రికా బౌలర్లు బౌన్సర్లు వేస్తూ తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అయితే బౌన్సర్లు ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మిగతా బ్యాటర్ల పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. వాస్తవానికి కాస్త ఓపికతో టీమిండియా బ్యాటర్లు ఆడి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ ఇప్పటికే చెయ్యి దాటిపోయింది.