IND Vs PAK Champions Trophy 2025 (1)
IND Vs PAK Champions Trophy 2025: సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత.. మీడియా రీచ్ మరింత ఎక్కువైన తర్వాత.. సెలబ్రిటీ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటున్నది. అయితే ఇందులో వీరు ఎంచుకున్న తోవ పరమ దరిద్రంగా ఉంటున్నది. ఏదో ఒక సంచలన విషయాన్ని తెరపైకి తేవడం.. దానిపై అడ్డంగా వాదించడం .. ఆ తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో నానడం పరిపాటిగా మారిపోయింది. ఒకవేళ వారి అంచనా నిజమైతే ఓవర్ నైట్ సెలబ్రిటీలు అవుతున్నారు. అంచనా తప్పితే జనాల చేతిలో విపరీతంగా తిట్లు తింటున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్ భారత్ ఆదివారం తలపడ్డాయి. హై వోల్టేజ్ మ్యాచ్లో పాకిస్తాన్ భారత చేతిలో ఆరు వికెట్ల ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు మన దేశంలో ఉన్న ఓ ఐఐటి బాబా సంచలన కామెంట్లు చేశాడు. భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోతుందని వ్యాఖ్యానించాడు. అది ఎలా సాధ్యమవుతుందని విలేకరులు ప్రశ్నిస్తే 2017 నాటి సంగతి చెప్పాడు. ” నాడు ధోని ఉన్నాడు. రోహిత్, విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. పెద్దపెద్ద ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. చివరికి ఏం జరిగింది.. పాకిస్తాన్ భారీ స్కోర్ కొడుతుంటే మనవాళ్లు అలా చూస్తుండిపోయారు. అలాంటప్పుడు ఇప్పుడు కూడా గెలుస్తుందని మీరు ఎలా అనుకుంటారని” ఐఐటి బాబా ప్రశ్నించాడు. దీంతో అతడు చెప్పిన మాటలన్నీ లాజిక్ కు దగ్గరగా ఉన్నాయని భావించిన మీడియా హైప్ ఇవ్వడం మొదలు పెట్టింది. ఇక పాకిస్తాన్ మీడియా అయితే భారత్ ఓడిపోయిందని తీర్మానించింది..
ఏకిపారేస్తున్నారు
ఐఐటి బాబా చెప్పినట్టుగా ఫలితం రాకపోవడంతో టీమిండియా అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని జోస్యం చెప్పిన అతడు ఎక్కడ ఉన్నాడంటూ తెగ వెతుకుతున్నారు. వాస్తవానికి టీమిండియా గెలిచిన తర్వాత.. విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత.. భారత్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటూ.. ట్విట్టర్లో టీం ఇండియాను ట్రెండింగ్లోకి తీసుకురావాల్సిన నెటిజన్లు.. ఐఐటి బాబాను ట్రెండింగ్ లోకి తెచ్చారు.. #IITianBaba యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. “చూడరా ఐఐటి బాబా.. నువ్వు ఐఐటి బాబావు ఎలా అయ్యావో తెలియదు. విరాట్ సెంచరీ చేశాడు. శ్రేయస్ అయ్యర్ హాఫ్ ఇంచరీ చేశాడు. రోహిత్ దూకుడుగా ఆడాడు. గిల్ అదరగొట్టాడు. అలాంటి ఆటగాళ్లు ఉన్న జట్టు ఓడిపోతుందని నువ్వెలా అనుకున్నావ్. ప్రతిసారి 2017 లాగా జరుగుతుందని ఎలా ఊహిస్తావ్? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. క్షమాపణలు చెప్పు. భారత గడ్డపై పుట్టి.. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నీలాంటి వాళ్ళు ఈ దేశం విడిచి వెళ్లాలని” నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా గెలిచిన నేపథ్యంలో కొంతమంది ఐఐటి బాబా గురించి వెతుకుతున్నారు. అయితే అతడి జాడ మాత్రం ఇంతవరకు లభించలేదు. భారత్ గెలిచిన నేపథ్యంలో ఐఐటి బాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని కొన్ని జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి.