New Zealand Vs India (3)
New Zealand Vs India: ఇప్పుడు నడుస్తోంది సోషల్ మీడియా కాలం. నేటి కాలంలో టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్లు చూసేవాళ్ళకంటే.. పనిచేస్తూ.. ఫ్రెండ్స్ తో కబుర్లు చెబుతూ.. ఆఫీసులో వర్క్ చేస్తూ మ్యా చ్ లు చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. అందువల్లే ఓటీటీ లలో క్రికెట్ మ్యాచ్లు చూసేవారు పెరిగారు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ను అలా చూసే వారి సంఖ్య ఏకంగా 81+ కోట్లను దాటింది.
ఆదివారం దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. సాధారణంగా టీమ్ ఇండియా ఆడే క్రికెట్ మ్యాచ్లను చాలామంది చూస్తుంటారు. పైగా క్రికెట్ ను టీమిండియా శాసిస్తోంది. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా భారతీయుడైన జై షా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ వెళ్ళింది. సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించి.. ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టుతో తలపడుతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందుగా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టులో మిచెల్ 63 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్రేస్ వెల్ 53* పరుగులు చేశాడు. వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్ చెరి రెండు వికెట్లు సాధించారు.. రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ చెరో వికెట్ పడగొట్టారు.
వ్యూస్లో రికార్డు
అనంతరం న్యూజిలాండ్ విధించిన లక్ష్యాన్ని చేదించడానికి రంగంలోకి దిగిన టీమిండియా.. తొలి వికెట్ కు 105 రన్స్ జోడించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(76), గిల్(31) దూకుడుగా ఆడినప్పటికీ.. గిల్ అవుట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా టర్న్ అయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు. కీలక దశలో రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) అవుట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో కేఎల్ రాహుల్ (16), హార్దిక్ పాండ్యా (5) క్రీజ్ లో ఉన్నారు. కడపటి వార్తలు అందే సమయానికి టీమిండియా 35 బంతుల్లో 35 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో జియో హాట్ స్టార్ లో క్రికెట్ లైవ్ చూస్తున్న వారి సంఖ్య 81+ కోట్లకు పెరిగిపోయింది. ఏకంగా అన్ని కోట్ల వ్యూస్ నమోదు కావడం జియో హాట్ స్టార్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఫైనల్ మ్యాచ్ కావడంతో జియో హాట్ స్టార్ యాడ్స్ తో పండగ చేసుకుంటున్నది. ఓ నివేదిక ప్రకారం ఫైనల్ మ్యాచ్ ద్వారా జియో హాట్ స్టార్ కు వందల కోట్లలో ఆదాయం వస్తుందని తెలుస్తోంది.