IND Vs NZ: విశాఖపట్నం అభివృద్ధిలో దూసుకుపోతోంది. కాస్మోపాలిటన్ నగరంగా ఎదగడానికి బలంగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఇప్పటికే ప్రఖ్యాతమైన ఐటీ సంస్థలు విశాఖపట్నంలో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
గూగుల్ నుంచి మొదలు పెడితే టి సి ఎస్ వరకు అన్ని సంస్థలు విశాఖపట్నం వేదికగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇది ఇలా ఉండగానే విశాఖపట్నం క్రికెట్ హబ్ గా మారబోతోంది. విశాఖపట్నంలో ఉన్న అంతర్జాతీయ స్టేడియంలో వరుసగా మ్యాచ్ లు జరుగుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో ప్రస్తుతం ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా బుధవారం కివీస్ జట్టుతో విశాఖపట్నం వేదికగా నాలుగవ టి20 మ్యాచ్ ఆడబోతోంది. గడిచిన 4 నెలల కాలంలో విశాఖపట్నంలో ఇది నాల్గవ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్. పురుషులకు భాగంలో రెండవ క్రికెట్ మ్యాచ్. భారత దేశంలో ఈ స్టేడియం కూడా ఇన్ని మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వలేదు.
గత ఏడాది అక్టోబర్ లో మహిళల వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్ లకు విశాఖపట్నం మైదానం ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత శ్రీలంక జట్టుతో జరిగిన భారత మహిళ టి20 సిరీస్లో రెండు మ్యాచ్ లకు వేదికగా నిలిచింది. సౌత్ ఆఫ్రికా జట్టుతో భారత పురుషులు ఆడిన మూడో వన్డే కూడా విశాఖపట్నం వేదికగా జరిగింది. ఇప్పుడు న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టి20 మ్యాచ్ కు విశాఖపట్నం వేదిక అయింది.
నాలుగు నెలల కాలంలోనే విశాఖపట్నం మైదానం ఇన్ని మ్యాచ్లకు వేదిక కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ చూపించిన చొరవ వల్ల ఈ స్థాయిలో మ్యాచ్లో జరుగుతున్నాయని క్రికెట్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. బీసీసీఐ రొటేషన్ పాలసీ పాటిస్తూ ఉంటుంది. దాని ప్రకారం ఒక ఏడాదిలో ఒక స్టేడియంలో ఒకే ఒక అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. కానీ లోకేష్ చొరవ చూపించడంతో తొమ్మిది మ్యాచ్ లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. దానికి తోడు జై షా తో లోకేష్ కు మంచి అనుబంధం ఉంది. అందువల్లే ఇదంతా సాధ్యమవుతుందని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.
ఇక గడిచిన రెండు సంవత్సరాలుగా ఉప్పల్ మైదానంలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగలేదు. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో 2024 లో జనవరి 25 నుంచి 29 మధ్య ఇంగ్లాండ్ జట్టుతో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. అదే ఏడాది అక్టోబర్లో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్లో భారత్ తలపడింది. ఇక అనంతరం ఐపీఎల్ మినహా.. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఉప్పల్ మైదానంలో జరగకపోవడం గమనార్హం.