IND Vs NZ:చిన్నపామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. ఈ నానుడి వెనుక ఎంత లోతైన అర్థం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన శిక్షకుడు గౌతమ్ గంభీర్ కు ఏ మాత్రం అర్థం కావడం లేదు. పైగా ఏకపక్ష నిర్ణయాలతో జట్టును మొత్తం నాశనం చేస్తున్నాడు. ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్లో టీమ్ ఇండియా దారుణమైన ఫలితాలను చూస్తోంది. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కూడా అదే స్థాయికి దిగజారే ప్రమాదం కనిపిస్తుంది.
2026 సీజన్లో టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో తొలి వన్డే సిరీస్ ఆడుతోంది. మొదటి మ్యాచ్లో విజయం సాధించిన టీమ్ ఇండియా.. రెండో మ్యాచ్లో అదే మ్యాజిక్ ప్రదర్శించలేకపోయింది. ముఖ్యంగా బౌలింగ్లో తేలిపోయింది. 284 పరుగులు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని నిలుపుకోలేకపోయింది. టీమిండియా ఇలా ఓడిపోవడానికి ప్రధాన కారణం బౌలర్ల వైఫల్యం. అన్నిటికంటే ముఖ్యంగా బౌలర్లను జట్టులోకి తీసుకునే విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్ నిర్లక్ష్యం ఫలితం.. టీమిండియాకు ఓటమిని తెచ్చిపెట్టింది. దీంతో గౌతమ్ గంభీర్ నిర్ణయం పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిరీస్ భవితవ్యాన్ని తేల్చే మూడో మ్యాచ్ లో ఎట్టకేలకు గౌతమ్ గంభీర్ బుద్ధి తెచ్చుకున్నాడు. ఇండోర్ వేదికగా ఆదివారం జరుగుతున్న మూడో వన్డేలో జట్టులో కీలక మార్పుకు శ్రీకారం చుట్టాడు. ముఖ్యంగా బౌలర్ అర్ష్ దీప్ సింగ్ కు అవకాశం కల్పించాడు. ప్రసిద్ కృష్ణ ను పక్కన పెట్టి అర్ష్ దీప్ సింగ్ కు చోటు కల్పించాడు. వాస్తవానికి, హర్షిత్ రాణా పై వేటు వేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అతడిని రక్షించే క్రమంలో.. గౌతమ్ గంభీర్.. ప్రసిద్ కృష్ణ ను పక్కనపెట్టి.. అర్ష్ దీప్ సింగ్ ను జట్టులోకి తీసుకున్నాడు. ప్రసిద్ కృష్ణ రెండవ వన్డేలో 9 ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. 49 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ పడగొట్టాడు. హర్షిత్ రాణా ఏకంగా 9.3 ఓవర్లు వేసి 52 పరుగులు ఇచ్చాడు. అతడు కూడా ఒక వికెట్ మాత్రమే తీశాడు. కానీ, హర్షిత్ మీద ప్రేమ చూపించి.. మూడో వన్డేలో ప్రసిద్ కృష్ణ పై వేటు వేశాడు. మ్యాచ్లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది.
