Bhatti Vikramarka: రాజకీయాల విషయానికి వస్తే.. తెర వెనుక పరిణామాల గురించి ప్రస్తావించాల్సి వస్తే.. ముందుగా అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తుకొస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగే రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెర వెనుక జరుగుతున్న వ్యవహారాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి చాలామందికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. పైగా అక్కడి రాజకీయ నాయకులు చేసుకొనే విమర్శలు కూడా ఒక స్థాయి దాటిపోతాయి. అందువల్లే మీడియా సంస్థలు కూడా అక్కడ రాజకీయాలను ప్రధానంగా ప్రసారం చేయడానికి ఇష్టపడుతుంటాయి. అక్కడి రాజకీయాలలో మీడియాకు కావాల్సినంత మసాలా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మించి ఇప్పుడు తెలంగాణలో పాలిటిక్స్ సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీవీ ఇటీవల ప్రచారం చేసిన ఓ కథనం తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. విపరీతమైన ప్రచారానికి కారణమవుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనం.. అది సృష్టించిన అలజడిని మర్చిపోకముందే.. మధ్యలోకి వేమూరి రాధాకృష్ణ వచ్చారు. నైని బ్లాక్ బొగ్గు తవ్వకాలు చేపట్టడానికి ఇదంతా జరిగిందని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కంపెనీకి నైని బ్లాక్ లో తవ్వకాలు దక్కకుండా చూసేందుకు ఇదంతా చేశారని రాధాకృష్ణ ఆరోపించారు…
రాధాకృష్ణ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాలలో తీవ్రమైన చర్చకు కారణమయ్యాయి. ముఖ్యంగా రాధాకృష్ణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను టార్గెట్ చేస్తూ స్టోరీని పబ్లిష్ చేయడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. దీంతో భట్టి విక్రమార్క స్పందించారు. ఈ కథనాన్ని సాక్షి మీడియా హౌస్ ప్రధానంగా పబ్లిష్ చేసింది. ఇంతకీ భట్టి విక్రమార్క ఏం మాట్లాడారంటే..
” బొగ్గు గనుల వ్యవహారంలో నాపై తప్పుడు రాతలు రాశారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసింది పూర్తిగా పిట్ట కథ. కట్టు కథ. అదంతా కూడా పూర్తిగా నిరాధారం. ఈ వ్యవహారంపై నేరుగా నేను ఆయనతోనే తేల్చుకుంటాను. ప్రజల ఆస్తులను కాపాడటం నా బాధ్యత. ఆస్తులను సంపాదించడానికి నేను రాజకీయాలకు రాలేదు. ప్రజలను కొన్ని రకాల గద్దలు తింటున్నాయి. వాటి నుంచి ప్రజలను రక్షించడానికి నేను రాజకీయాల్లోకి ప్రవేశించాను. రాజకీయాల్లోకి వచ్చిన నటించి ఇప్పటివరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాను. ఉన్న వనరులను రక్షించుకుంటూ ప్రజలకు పంచే ప్రయత్నం చేస్తున్నాను. సింగరేణి తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆస్తి. బొగ్గు గనుల టెండర్లను సింగరేణి సంస్థ పిలుస్తుంది. టెండర్ల నిబంధనలను సింగరేణి సంస్థ పర్యవేక్షిస్తుంది. కొన్ని సందర్భాలలో క్లిష్టమైన ప్రాంతాలలో గనులు ఉంటాయి. కాబట్టి ఫీల్డ్ విజిట్ అనేది కచ్చితంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇటువంటి నిబంధనలు ఉంటాయి. రాయడం కంటే ముందు విషయం తెలుసుకోవాలని” భట్టి వ్యాఖ్యానించినట్టు సాక్షి రాస్కొచ్చింది. మరి దీనిపై రాధాకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
