India vs England 4th Test: భారత్ గెల‌వ‌డానికి ప్రధాన కారణాలివే.. ఎక్క‌డ తేడావ‌చ్చినా ఫ‌లితం వేరే!

India vs England 4th Test: క్రికెట్లో ఏ ఒక్క‌రో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తే స‌రిపోదు. ఏదో ఒక్క విభాగంలో అంద‌రూ గొప్ప‌గా ఆడినా కూడా విజ‌యం ద‌క్క‌దు. అన్ని విభాగాల్లోనూ జ‌ట్టు మొత్తం స‌మ‌ష్టిగా కృషి చేసిన‌ప్పుడే గెలుపు సొంత‌మ‌వుతుంది. దీనికి స‌రైన ఉదాహ‌ర‌ణ ఇంగ్లండ్ – ఇండియా మ‌ధ్య జ‌రిగిన నాలుగో టెస్టు. ఈ మ్యాచ్ లో భార‌త్ అద్భుత‌మైన విజ‌యం సాధించింది. గెలుపున‌కు అవ‌కాశం ఉన్న ఇంగ్లండ్ ను క‌ట్ట‌డిచేసి, చ‌రిత్రాత్మ‌క‌మైన గెలుపు […]

Written By: Bhaskar, Updated On : September 7, 2021 11:34 am
Follow us on

India vs England 4th Test: క్రికెట్లో ఏ ఒక్క‌రో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తే స‌రిపోదు. ఏదో ఒక్క విభాగంలో అంద‌రూ గొప్ప‌గా ఆడినా కూడా విజ‌యం ద‌క్క‌దు. అన్ని విభాగాల్లోనూ జ‌ట్టు మొత్తం స‌మ‌ష్టిగా కృషి చేసిన‌ప్పుడే గెలుపు సొంత‌మ‌వుతుంది. దీనికి స‌రైన ఉదాహ‌ర‌ణ ఇంగ్లండ్ – ఇండియా మ‌ధ్య జ‌రిగిన నాలుగో టెస్టు. ఈ మ్యాచ్ లో భార‌త్ అద్భుత‌మైన విజ‌యం సాధించింది. గెలుపున‌కు అవ‌కాశం ఉన్న ఇంగ్లండ్ ను క‌ట్ట‌డిచేసి, చ‌రిత్రాత్మ‌క‌మైన గెలుపు సొంతం చేసుకుంది. ఒక‌టీ రెండు కాదు.. 50 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ లోనూ విజ‌యం సాధించ‌లేక‌పోయిన ఓవ‌ల్ మైదానంలో గెలుపు జెండా ఎగ‌రేసింది. మ‌రి, ఈ విక్ట‌రీ వెనుక ఉన్న కార‌ణాలేంట‌న్న‌ది చూద్దాం.

ఓవ‌ల్ మైదానంలో ఆరంభ‌మైన‌ నాలుగో టెస్టులో మొద‌ట టీమిండియా బ్యాటింగ్ చేసింది. ఈ గ్రౌండ్ లో టెస్టు మ్యాచ్ ఆడిన ఏ జ‌ట్టైనా.. తొలి ఇన్నింగ్స్ లో 350 ప‌రుగులు చేసింది. కానీ.. భార‌త్ మాత్రం కేవ‌లం 191 ప‌రుగులు చేసి కుప్ప‌కూలింది. అయితే.. శార్ధూల్ ఠాకూర్ బ్యాటింగ్ (57) ఫ‌లితంగా ఈ స్కోరు వ‌చ్చింది. లేదంటే.. మ‌రోసారి వంద లోపే ఆలౌట్ అవుతుంద‌ని అంద‌రూ భావించారు. ఆ విధంగా.. ఠాకూర్ త‌న‌దైన బ్యాటింగ్ తో జ‌ట్టును ఆదుకున్నాడు. అటు రెండో ఇన్నింగ్స్ లోనూ బ్యాట్ ఝుళిపించిన శార్దూల ఠాకూర్ 72 ప‌రుగులు సాధించింది. భార‌త బ్యాటింగ్ లో కీల‌క‌మైన పాత్ర‌పోషించాడు. ఇదే.. మొద‌టి ట‌ర్నింగ్ పాయింట్‌.

భార‌త గెలుపున‌కు కార‌ణ‌మైన రెండో అంశం.. రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేయ‌లేక‌పోయిన రోహిత్‌.. రెండో ఇన్నింగ్స్ లో 127 ప‌రుగులు సాధించాడు. ఓపెన‌ర్ రాహుల్ (46) తో క‌లిసి 83 ప‌రుగులు జోడించిన రోహిత్‌.. ఆ త‌ర్వాత పుజారాతో క‌లిసి మ‌రో విలువైన పార్ట్ న‌ర్ షిప్ అందించాడు. రోహిత్ సెంచ‌రీతో.. ఇంగ్లండ్ ముందు భారీ ల‌క్ష్యాన్ని భార‌త్ ఉంచ‌గ‌లిగింది.

మూడో కార‌ణం బౌలింగ్ విభాగం. 368 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది ఇంగ్లండ్‌. నాలుగో రోజు సాయంత్రానికి వికెట్ పోకుండా 70 ప‌రుగులు సాధించిన ఇంగ్లండ్‌.. ఐదో రోజున‌ మిగిలిన స్కోరు ఛేదించ‌డం పెద్ద క‌ష్టంగా క‌నిపించ‌లేదు. చేతిలో 10 వికెట్లు అలాగే ఉండ‌డంతో.. ఇంగ్లీష్ వైపు గెలుపు మొగ్గిన‌ట్టే క‌నిపించింది. కానీ.. భార‌త బౌల‌ర్లు అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న చేశారు. యార్క‌ర్ కింగ్ బుమ్రా.. ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు మాత్ర‌మే తీసినా.. అవి కీల‌క‌మైన ఆట‌గాళ్ల‌వి కావ‌డంతో.. ఆ జ‌ట్టుపై ప్ర‌భావం చూపింది. చివ‌రి రోజున‌ ఉమేష్ యాద‌వ్ (3), బుమ్రా 2, శార్దూల్ 2 వికెట్లు తీసి బ్రిటీష్ జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించారు.

ఇక‌, భార‌త్ విజ‌యానికి కార‌ణ‌మైన‌ నాలుగో అంశం కోహ్లీ కెప్టెన్సీ. ఈ మ్యాచ్ లో విరాట్ నాయ‌క‌త్వం ఆక‌ట్టుకుంది. వివాదాల‌కు దూరంగా మ్యాచ్ మీద‌నే ఫోక‌స్ పెట్టిన భార‌త కెప్టెన్‌.. జ‌డేజాను బ్యాటింగ్ ఆర్డ‌ర్లో ముందుకు తెచ్చాడు. ఇది ఫ‌లించింది. బుమ్రాకు కొత్త బంతిని ఇవ్వ‌డం, కీల‌క‌మైన స‌మ‌యంలో ఉమేష్ యాద‌వ్ కు బౌలింగ్ అప్ప‌గించ‌డం కూడా క‌లిసి వ‌చ్చింది. మైదానంలో ఆట‌గాళ్ల‌తో చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌డం జోష్ పెంచింది. ఈ విధంగా.. భార‌త ఆట‌గాళ్లు అన్ని విభాగాల్లో స‌మ‌ష్టిగా రాణించ‌డంతో చారిత్ర‌క విజ‌యాన్ని న‌మోదు చేసింది టీమిండియా. 1971 త‌ర్వాత ఓవ‌ల్ మైదానంలో భార‌త్ గెల‌వ‌డం ఇదే.