IND vs ENG : అంతటి ఆటగాడు ఆడకపోవడమేంటి? ఇంగ్లాండ్ క్రికెటర్ల ఆశ్చర్యం

ఈ సిరీస్ లో బజ్ బాల్ విజయవంతమైందని పేర్కొన్న బ్రాడ్.. బెన్ స్టోక్స్ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ జట్టు అద్భుతాలు చేస్తోందని కొనియాడాడు.

Written By: NARESH, Updated On : February 12, 2024 7:01 pm
Follow us on

IND vs ENG : ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు భారత్లో పర్యటిస్తోంది. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తయ్యాయి. మొదటి టెస్ట్ హైదరాబాదులో జరగగా.. ఇంగ్లాండ్ జట్టు అనూహ్య రీతిలో విజయం సాధించింది. విశాఖపట్నంలో జరిగిన రెండవ టెస్టులో భారత జట్టు గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15 నుంచి గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్ లో మూడవ టెస్ట్ జరగనుంది. ఇప్పటికే ఇంగ్లాండ్, భారత జట్లకు చెందిన క్రీడాకారులు రాజ్ కోట్ చేరుకున్నారు. అక్కడి మైదానంలో నిరంతరం సాధన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టులో ఓ కీలకమైన క్రీడాకారుడు ఆడక పోవడం పట్ల ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ క్రీడాకారుడు ఎవరు? ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఎందుకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

వన్డే, టెస్ట్, టీ 20.. ఇలా ఏ ఫార్మాట్ లో అయినా విరాట్ కోహ్లీ దుమ్ము దులపగలడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చీల్చి చెండాడ గలడు. అందుకే అతడు పరుగుల యంత్రంగా పేరు పొందాడు. అయితే అలాంటి మేటి బ్యాటర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో ఆడటం లేదు. అతడు ఆడక పోవడం పట్ల ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్, విరాట్ కోహ్లీ మధ్య యుద్ధాన్ని మిస్ అవుతున్నామని నిట్టూరుస్తున్నారు. ఇంగ్లాండ్ లెజెండరీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.. కోహ్లీ ఆడక పోవడం వల్ల రసవత్తరమైన ఆటను ఆస్వాదించలేకపోతున్నామన్నాడు.” కోహ్లీ గొప్ప ఆటగాడు. అద్భుతమైన టెక్నిక్ అతడి సొంతం. ఆటపట్ల అతడికి విపరీతమైన అంకితభావం ఉంటుంది. మైదానంలో అతడు చిరుతను తలపిస్తాడు. అతడి దూకుడు ను అందరూ ఇష్టపడతారు. వ్యక్తిగత కారణాలు ఎటువంటివైనా సరే ఆటగాడిని కొద్ది రోజులపాటు మైదానానికి దూరం చేస్తాయి. విరాట్ కోహ్లీ ఈ టెస్ట్ సిరీస్ లో ఆడక పోవడం వల్ల కొంతమంది యువ ఆటగాళ్లకు అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. కుర్రాళ్ల పోరాట పటిమ చూస్తుంటే ఎక్కువకాలం జట్టుకు సేవలు అందిస్తారని పిస్తోంది” అని బ్రాడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఈ సిరీస్ లో బజ్ బాల్ విజయవంతమైందని పేర్కొన్న బ్రాడ్.. బెన్ స్టోక్స్ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ జట్టు అద్భుతాలు చేస్తోందని కొనియాడాడు. ఉప్పల్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టును ఇంగ్లాండ్ జట్టు మట్టి కరిపించిందని పేర్కొన్నాడు. అంతకుముందు పాకిస్తాన్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిందని గుర్తు చేశాడు. న్యూజిలాండ్ జట్టును కూడా ఇంగ్లాండ్ జట్టు ఓడించిందని బ్రాడ్ ఉదహరించాడు. ఇక ఇంగ్లాండ్ జట్టు లెజెండరీ బౌలర్ అయిన బ్రాడ్.. అంతర్జాతీయ క్రికెట్ కు జూలైలో వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ జట్టు తరఫున 165 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 604 వికెట్లు తీశాడు. వన్డేలతో కలిపి 800 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఇంగ్లాండ్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఆస్ట్రేలియా జట్టు పై 150 వికెట్లు తీసిన తొలి ఇంగ్లాండు బౌలర్ గా స్టువర్ట్ బ్రాడ్ వినతికెక్కాడు.